calender_icon.png 26 March, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుప్పకూలిన విద్యావ్యవస్థను సరిచేస్తున్నాం X మేము 26 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం!

26-03-2025 01:20:52 AM

కుప్పకూలిన విద్యావ్యవస్థను సరిచేస్తున్నాం

  1. మంచి చేద్దామన్నా వారి మంత్రులను కేసీఆర్ చేయనీయలేదు
  2. 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): గత పదేళ్లలో కుప్పకూలిన విద్యావ్యవస్థను సరిచేస్తున్నామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి విద్యా, వైద్యం ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో విద్యాశాఖ పద్దులపై జరిగిన చర్చలో బీఆర్‌ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.

రాష్ర్టంలో 79 అదనపు పాఠశాలలను తమ ప్రభుత్వం పునరుద్ధరించి నట్లు వివరించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతం కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి అప్పటి సీఎం కేసీఆర్‌ను కలిసి సూచనలు చేసినప్పటికీ ఆయన స్పందించలేదని వెల్లడించారు.

విద్యా రంగానికి మంచి చేద్దామని భావించినప్పటికీ కేసీఆర్ వల్ల ప్రయత్నం బెడిసి కొట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు గుర్తుచేశారు. విద్యా వ్యవస్థను సరిచేసేందుకు కాస్త సమయం పడుతుందని తెలిపారు. 

మేము 26 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం!

  1. ఒక్క పోస్టు భర్తీ చేయలేదని నిరూపించగలరా?
  2. మంత్రి శ్రీధర్ బాబుకు హరీశ్‌రావు సవాల్

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని నిరూపించగలరా అని మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరారు. అసెంబ్లీలో మంగళవారం విద్యాశాఖ పద్దుపై జరిగిన చర్చలో హరీశ్ రావు మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబు తన పేరును ప్రస్తావించారు కాబట్టి సభ రికార్డులను సవరించడానికి తాను మాట్లా డుతున్నట్లు తెలిపారు.

బీఆర్‌ఎస్ హ యాంలో ఒక్క టీచర్ రిక్రూట్‌మెంట్ జరగలేదని సత్య దూరమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ హయాంలో మొత్తం 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయని.. అందులో 8 వేల ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, గురుకులాల ద్వారా 18 వేల నియామకాలు చేపట్టినట్లు గుర్తుచేశారు.

తాము 26 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తే.. ఒక్కటి కూడా భర్తీ చేయలేదని మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మూతపడ్డ 1913 ప్రభుత్వ స్కూళ్ల గురించి మాట్లాడకుండా..79 స్కూళ్లు తెరిపించామని శ్రీధర్ బాబు పేర్కొనడం హాస్యాస్పదమన్నారు.