calender_icon.png 23 October, 2024 | 12:56 AM

మాకు తీరనిలోటు..

11-07-2024 01:30:00 AM

తెలంగాణ ఉద్యమంలో పాలమూరు వలస కూలీల దుర్భర జీవితాల దుఃఖ గానం లేకుండా రాష్ట్రంలో ఎక్కడా సభలు జరిగేవి కావు. సామాన్యుడు మూడు పూటల కడుపు నిండా తినలేని పరిస్థితి నాటి సీమాంధ్ర పాలనలో ఉండేది. తెలంగాణ ప్రజలు అంటే అప్పటి పాలకులకు చిన్నచూపు. వలసలు ఆగాలన్నా.. బతుకులు మారాలన్నా.. పంటలకు నీరు రావాలన్నా.. ఒక్కటే పరిష్కారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయనే నమ్మకంతో 2013 అక్టోబర్ 12న ఒంటిపై కిరోసిన్ పోసుకొని మంటల్లో ఆహుతయ్యాడు వనపర్తి జిల్లా పెద్దమందడి గ్రామానికి చెందిన వీరసాగర్. అలా మలిదశ ఉద్యమానికి ఊపిరి పోశారు.  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతుందన్న బాధతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని వీరసాగర్ ప్రాణాలు వదిలాడు. అలా ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి మలిదశ ఉద్యమానికి ఊపిరి పోశారు. అప్పటి ఉద్యమనేత కెసీఆర్ అధ్యక్షతన సీమాంధ్ర పాలకుల నుంచి విముక్తి కావాలంటే తెలంగాణ రాష్ట్రం సిద్దించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన తిరుగుబాటుకు గ్రామం నుంచి మొదలుకుని పట్టణాలల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రజలు సైతం పిడికిలి బిగించి ఉద్యమానికి అండగా నిలిచారు.

ఎంతో మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వస్తదా? రాదా? తెలంగాణ కోసం నా ప్రాణం పోయిన పర్వాలేదు తెలంగాణ రావాలంటూ వనపర్తి జిల్లా పెద్దమందడి మండలానికి చెందిన వీరసాగర్ 2013 అక్టోబర్ 12వ తేదిన కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మండల కేంద్రంలో ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడింది. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత అప్పటి సీఎం కెసీఆర్  ప్రభుత్వంలో వీరసాగర్ కుటుంబంలో రెండవ అక్క పద్మకు కొత్తకోట మండల కేంద్రంలోని బీసీ గురుకుల హాస్టల్ వంట మనిషి ఉద్యోగంతో పాటు కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 

కుటుంబం గురించి..

పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన బాలస్వామి, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు వీరసాగర్. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించే వీరసాగర్ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. తెలంగాణ వస్తేనే సామాన్యుల బతుకులు మారుతాయంటూ నిత్యం అదే ధ్యాసలో ఉండేటోడు. అమ్మ, నాన్నకు ఒక్కడివే మనకెందుకు అని కుటుంబికులు చెబితే తెలంగాణ రావాలి అప్పుడు మనలాంటి సామాన్యుల బతుకులు మారుతాయని చెప్పి బాధపడేవాడు. తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కుతున్న ఆంధ్రా నాయకుల కక్షలను చూసి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. 

పీ రాము, వనపర్తి, విజయక్రాంతి

* తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కగానొక్క తమ్ముడు వీరసాగర్ ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఎదిగి వచ్చిన తమ్ముడు చనిపోవడం అప్పటికే తల్లిదండ్రులు మృతి చెందడం మా కుటుంబం రోడ్డున పడిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో రూ 10లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఉద్యోగాన్ని కల్పించింది. కానీ మాలాంటి కుటుంబాలు ఇప్పటికి చాలా ఉన్నాయి. ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఆదుకుంటే బాగుంటుంది. మా కుటుంబంలో తమ్ముడు లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరు. ఆ బాధ మా జీవితకాలం ఉంటుంది.   

అక్క పద్మ