ప్రజలకు పంచుతున్నాం
త్వరలోనే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బీజేపీ కుట్రలను తిప్పికొడదాం
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పిలుపు
అక్రమ కేసులు ఎత్తేయాలి: వీహెచ్
హైదరాబాద్,సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంపద సృష్టించి ప్రజలకు పంచుతున్నదని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నామని, పార్టీ లక్ష్యాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు భట్టి సూచించారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడారు.
ప్రజా పాలనను మరింతగా ప్రజలకు దగ్గరచేసేందుకు కార్పొరేషన్ల చైర్మన్లను నియమించామని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కార్యకర్తలు ఎంతో కీలకమని, పార్టీ అధికారం లోకి రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేశారని కొనియాడారు. నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందనడానికి మహేష్‌కుమార్‌గౌడ్ నిదర్శనమని భట్టి పేర్కొన్నారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలి: వీహెచ్
బీఆర్‌ఎస్ హయాంలో పార్టీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పీసీసీ మాజీ అధ్య్యక్షుడు వీ హనుమంతరావు సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. పార్టీలో కొత్త వాళ్లతో పాటు మొదటి నుంచి పనిచేస్తున్న వారికి కూడా న్యాయం చేయాలని కోరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పార్టీ శ్రేణులు పదేళ్లు ఎన్నో ఉద్యమాలు చేస్తే.. అక్రమ కేసులు పెటి ఇబ్బందులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. కుల గణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతాయని అన్నారు.
బీసీ కుల గణనపై ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. సెప్టెంబర్ 17తో బీజేపీ ఎలాంటి సబంధం లేదని, పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేయడానికి తీసకొచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని గత ప్రభుత్వం పోలీస్ స్టేషన్‌లో పెట్టిందని, ఆ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించాలని సీఎంను వీహెచ్ కోరారు. పీసీసీ పదవి కోసం బీసీలు కొట్టుకుంటే.. వేరే వాళ్లకు పదవి పోతుందని, తాను మహేష్‌కుమార్‌గౌడ్‌కు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు.
సెప్టెంబర్ 17పై బీజేపీ తొండి: మంత్రి ఉత్తమ్
తెలంగాణ సాయుధ పోరాటంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేకపోయినా సెప్టెంబర్ 17పై ఆ పార్టీ ఏదేదో ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ స్టేట్ దేశంలో విలీనం కావడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కూడా బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఉత్తమ్ పేర్కొన్నారు. బీజేపీ కుట్రలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తిప్పికొట్టాలని, అందుకు ప్రతి ఒక్కరు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాని కాబోతున్నారని, అందుకు ప్రతి కార్యకర్త మిలిటెంట్‌గా పని చేయాలని ఆయన సూచించారు.
ప్రధాని నరేంద్రమోదీ గ్రాఫ్ పడిపోతున్నదని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బడుగు, బలహీన వర్గాల నాయకుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు తన నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, మహేష్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే నమ్మకం ఉందని, పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేసిన వ్యక్తికి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఇతర పార్టీల్లో ఒకే సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఉంటుందని అన్నారు.