calender_icon.png 27 September, 2024 | 4:57 PM

ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

27-09-2024 01:40:49 AM

  1. లైఫ్‌సైన్సెస్ రంగంలో తెలంగాణే అగ్రగామి
  2. ప్రపంచ ఔషధ ఉత్పత్తుల్లో భారత్ నుంచే 35 శాతం
  3. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం తాము ఎంతో కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్రారంభమైన అనలిటికా అనకాన్ ఇండియా, ఇండియా ల్యాబ్ ఎక్స్‌పో, ఫార్మాప్రో ఎక్స్‌పో కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఫార్మా ఉత్పత్తుల రంగంలో, ఫార్మా సంబంధిత పరిశోధనలో భారతదేశ ప్రాధాన్యత గురించి వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఔషధ ఉత్పత్తిలో భారత్‌కు 35 శాతం భాగస్వామ్యం ఉందని, రానున్న రోజుల్లో ఈ భాగస్వామ్యం 50 శాతానికి చేరుకుంటుందని ఆకాంక్షించారు. దేశం నుంచి విదేశాలకు ఎగుమతయ్యే మందుల్లో 40 శాతం తెలంగాణలోనే తయారవుతున్నాయని తెలిపారు. బల్క్‌డ్రగ్ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే వెల్లడం గర్వకారణమని పేర్కొన్నారు. ఫార్మాస్యూటికల్స్, లైఫ్‌సైన్సెస్ రంగాలకు మంచి వనరులు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈల వృద్ధి ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు.

మన దేశంలోని సంస్థలు ప్రపంచ దేశాలతో పోటీ పడేలా అభివృద్ధి చెందే వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా జీనోమ్ వ్యాలీ నాలుగో దశ వంటి ప్రత్యేక జోన్ల వృద్ధి గురించి ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్, మెడ్‌టెక్ అంకుర సంస్థల్లో తెలంగాణ వాటా 19 శాతంగా నమోదైందని చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా లైఫ్‌సైన్సెస్ రంగం విస్తరణలో తెలంగాణ బలమైన భాగస్వామిగా ఉందని పునరుద్ఘాంటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రపంచ లైఫ్ సైన్సెస్ వాల్యూ చైన్‌లో తెలంగాణ కీలకంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఎక్స్‌పోకు 25 దేశాల నుంచి 25 వేల ఉత్పత్తులు ప్రదర్శనకు రావడం సంతోషంగా ఉందన్నారు. మెస్సెమూంచెన్ ఇండియా సీఈవో భూపిందర్ సింగ్ మాట్లాడుతూ... ఫార్మాస్యూటికల్స్, బయోటెక్ రంగాల్లో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో తెలంగాణ పాత్ర కీలకమైనదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐపీఎంఎంఏ అధ్యక్షుడు హర్షిత్ షా, ఫార్మెక్సిల్ చైర్మన్ డా.ఎస్వీ వీరమని పాల్గొన్నారు.