calender_icon.png 28 December, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ ప్రక్షాళనకు కట్టుబడి పనిచేస్తున్నాం

05-11-2024 12:59:43 AM

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాప్రజల బాధలు తీర్చేందుకే తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు పూనుకొన్నదని, అందుకు అనుగుణంగా పనిచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

ఈ 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటిస్తున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో యాదాద్రి జిల్లా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.210 కోట్ల మంచినీటి సరఫరా పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, ఫ్లోరైడ్‌తో కాళ్లు, చేతులు వంకర్లు పోయి, క్యాన్సర్ వంటి జబ్బులతో చచ్చిపోతుంటే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్‌ఎస్, బీజేపీ కావాలనే బాధితులను రెచ్చగొడుతున్నాయని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు.

నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని దాదాపు కోటిన్నర మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకే తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు పూనుకొన్నదని తేల్చిచెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి పాల్గొన్నారు.