calender_icon.png 17 November, 2024 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నాం

17-11-2024 06:30:45 PM

రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆందోళన, బొగ్గు లారీలను నిలిపి నిరసన  

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఉపరితలగనికి వెళ్లే వాహనాలతో ఎగిసిపడుతున్న దుమ్ముతో అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నామంటూ దాసుతండ గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. టేకులపల్లి బోడు రోడ్ కూడలి నుంచి దాసుతండ వరకు రహదారి విస్తరించి డివైడర్ నిర్మిస్తూ సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టారు. మొదట అర కిలోమీటర్ వరకు పూర్తి చేశారు. మిగతా అర కిలోమీటర్ పనులు చేపట్టి రోడ్డును తవ్వి పనులు వదిలేశారు.

అప్పటి నుంచి రేగులతండా, దాసుతండ వాసులకు ఇబ్బందులు మొదలయ్యాయి. వాహనాల రాకపోకలతో ఎగిసిపడే దుమ్ముతో నానాయాతన పడుతున్నారు. విసిగారి ఆందోళన చేపడితే సింగరేణి అధికారులు వెంటనే రోజుకు మూడు మార్లు నీళ్లు పోయించేందుకు ఒప్పుకొన్నారు. ఒక రోజు పోస్తే ఒక రోజు నీరు పోయాక పోవడంతో మళ్ళీ మొదటికొచ్చింది. నీళ్లు కాదు, రోడ్డు నిర్మాణం చేపట్టండంటూ మళ్ళీ రోడ్డెక్కారు. పోలీసులు, సింగరేణి అధికారులు నచ్చచెప్పినా ససేమిరా అంటున్నారు. అటు సింగరేణికి పట్టదు, ఆర్ అండ్ బి కి గిట్టదు అన్న చందమైంది. ఈ రహదారి పరిస్థితి. తక్షణమే సింగరేణి అధికారులు చొరవ చూపి రెండు గ్రామాల ప్రజల ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఉంది.