calender_icon.png 2 October, 2024 | 11:58 PM

ఉద్యమంలో మేము సైతం

03-09-2024 10:40:21 PM

నిర్మల్, విజయక్రాంతి :

తెలంగాణ ఉద్యమంలో నిర్మల్ విశ్రాంత ఉద్యోగులు అవిశ్రాతంగా పోరాడారు. నిర్మల్, బైంసా, ఖానాపూర్ నిమోజకవర్గాల్లో ఉద్యోగ పెన్షనర్లు 2011లో సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఒక కమిటీగా ఏర్పడి దాదాపు 3,965 మంది తెలంగాణ ఉద్యమంతో పాల్గొన్నారు. వీరంతా ప్రభుత్వ సర్వీసుల్లో పని చేసి పదవీ విరమణ పొందినవారే. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో సంఘటితమై నినదించారు. రిలే నిరహార దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు చేసి పిల్లల్లో ఉద్యమ చైతన్యం నింపారు.

ఐక్యతతో పోరాటాలు చేశాం

ఆంధ్ర పాలకుల పెత్తనంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. అవన్నీ నేను కళ్లారా చూశా. ముఖ్యంగా నీళ్ళు, నిధులు, నియమకాల్లో తీవ్ర అన్యాయం జరిగింది. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంతోపాటు మలిదశ ఉద్యమంలో పాల్గొన్నా. 1969లో విద్యార్థి దశలో ఉద్యమం చేపట్టగా అప్పటి ప్రభుత్వం మమ్ముల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ఏర్పాటును వివరించి ప్రతిఒక్కరూ పాల్గొనేలా అవగాహన కల్పించా. ప్రస్తుతం బంగారు తెలంగాణ సాధ్యంకాకున్నా.. రాష్ట్రం సాధించినా సంతృప్తి నాకు ఉంది. 

 ఎంసి లింగన్న, పెన్షనర్ల సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు

ఆ దెబ్బలు ఇప్పటికీ..

మాది నిర్మల్‌లోని ఖానాపూర్. మలిదశ ఉద్యమం కార ణంగా మా చదువులు ముందు కు సాగలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఎన్నో కేసులు పెట్టారు. పోలీసులచేత ఎన్నో దెబ్బలు తిన్నా. ఇప్పటికీ ఆ దెబ్బలు నొప్పి పెడుతుంటాయి. ప్రభుత్వ వైద్యుడిగా పదవి విరమణ పొందిన తర్వాత పూర్తిగా ఉద్యమాలకే పరిమితమయ్యా. 42 రోజులుపాటు సకల జనుల సమ్మెలో పాల్గొని కొట్లాడినం. వయసు మీదపడినా వెనకడుగు వేయలేదు.

డాక్టర్ నాగేశ్వర్‌రావు, వైద్య జేఏసీ నేత

పిల్లల్లో చైతన్యం కల్పించా

నేను గవర్నమెంట్ టీచర్‌ను. ఉమ్మడి రాష్ట్రంలో నాలాంటివాళ్లు ఎంతో నష్టపోయాం. తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమ సంఘాలు ఏ పిలుపు ఇచ్చినా.. పాల్గొనేవాడ్ని. నేను పదవీ విరమణ చేసే సమయంలో మలి దశ ఉద్యమం జోరుగా సాగుతోంది. పిల్లలు వద్దని చెప్పినా.. నావంతుగా పోరాటాల్లో పాల్గొన్నా. రిటైర్డ్ టీచర్ కావడంతో విద్యార్థులకు రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించి ఎంతోమంది పిల్లలను భాగస్వామ్యం చేశా.

 రావుల గంగన్న, రిటైర్డ్ టీచర్