calender_icon.png 27 January, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేం ప్రజలకు జవాబుదారీ!

27-01-2025 01:00:28 AM

  1. నాలుగు కొత్త పథకాలతో ముందడుగు
  2. ఎకరానికి రూ.12 వేల చొప్పున ‘రైతుభరోసా’
  3. రూ.22,500 కోట్లతో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు
  4. 10 లక్షల మందికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’
  5. వలసెళ్లిన కుటుంబాలకూ రేషన్ కార్డులు
  6. సీఎం అయినా, మంత్రైనా నేరుగా ప్రజల చెంతకు: సీఎం రేవంత్‌రెడ్డి 

నారాయణపేట, జనవరి 26 (విజయక్రాంతి): ‘గడిచిన పదేళ్లలో ఎప్పుడైనా గ్రామాల్లో అధికారులను చూశారా? మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రైనా, మంత్రైనా ప్రజల వద్దకు వెళ్తారు. ప్రజలకు దగ్గరుండి సంక్షేమ పథకాలు అందిస్తారు. వారికి  సేవ చేస్తారు. మేం ప్రజలకు జవాబుదారీ. మాది ఫాం హౌస్ పాలన కాదు.

గడీలు కట్టుకునే పాలన కాదు.. మాది ప్రజాపాలన’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘా టించారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో ఆదివారం ఆయన రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరో సా, కొత్త రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇల్లు పథకాలను ప్రారంభించి మాట్లాడారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవకర్గం నుంచి పథకాలకు అంకురార్పణ జరగడం ఆనందాన్నిస్తోందన్నా రు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల పరిధిలో చిట్టచివరి అర్హుడి వరకు సంక్షేమ పథకాలను చేరవేస్తామని హామీ ఇచ్చారు.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2022 వరకు ఎవరు అధికారంలో ఉన్నా కొడంగల్ నియోజకవర్గానికి న్యాయం జరగలేదని, తానిప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నానని వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు తనను నమ్మి ఓటు వేసి గెలిపిస్తే, ఏఐసీసీ పెద్దలు సోనియాగాంధీ, మల్లికార్జునఖర్గే, రాహుల్ గాంధీ రాష్ట్రానికి సీఎం చేశారని కొనియాడారు.

సీఎం బాధ్యతలు చేపట్టాక నియో జకవర్గం కోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని, నాలుగు కోట్ల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూనే, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నానని తెలిపారు. రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమమే ధ్యేయమని వెల్లడించారు.

రైతులది, కాంగ్రెస్ పార్టీది.. భూమికి, విత్తనానికి ఉన్న అనుబంధం

భూమికి, విత్తనానికి ఎలాంటి అనుబంధం ఉంటుందో.. రైతులకు, కాంగ్రెస్ పార్టీది అలాంటి అనుబంధమని సీఎం అభివర్ణించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పంటలకు ఉచిత విద్యుత్ అందిందని, ఆయన హయాంలోనే విద్యుత్ బకాయిలు సైతం రద్దయ్యాయని గుర్తుచేశారు.

నాటి యూపీఎ ప్రభుత్వ దేశవ్యాప్తంగా రూ.72 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేశారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వం ‘వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ’ అని నిరూపించిందని, వారి పాలనను ఆదర్శంగా తీసుకుని తమ ప్రభుత్వం తెలంగాణలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసిందని, తద్వారా 22.50 లక్షల మంది రైతులకు రుణవిముక్తి కలిగిందన్నారు.

రూ. 22,500 కోట్లతో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భాగంగా 10 లక్షల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.6 వేల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. వలస వెళ్లిన కుటుంబాలకు సైతం రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. మార్చి 31 నాటికి పథకాలన్నింటినీ సంపూర్ణంగా అమ లు చేసి తీరుతామని తేల్చిచెప్పారు.

55,145 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం.. 

దేశంలోనే ఏ రాష్ట్రంలో భర్తీ చేయని విధంగా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,145 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం వెల్లడించారు. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, నిరుపేదల ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు.

50 లక్షల కుటుంబాలకు రాయితీ కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఏడాదిలో 120 కోట్ల మంది మహిళలు, ఆడ బిడ్డలు ఉచిత బస్సు ప్రయాణం చేశారన్నా రు. ఉచిత టికెట్లకు సంబంధించి ప్రభుత్వం ఆర్టీసీ కి రూ.4వేల కోట్లు చెల్లించిందని తెలిపారు.

గతప్రభుత్వం ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు మాత్రమే పెట్టుబడి సాయం అందించేదని, తమ ప్రభుత్వం ఎకరానికి రూ.12,000 అందజేస్తున్నదని తెలిపారు. పథకంలో భాగంగా ఏటా రూ.20 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. యాసంగికి అర్ధరాత్రి నుంచే రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ అవుతాయని స్పష్టం చేశారు.

అసెంబ్లీకి రాని కేసీఆర్‌కు పదవెందుకు?

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొడంగల్ నియోజకవర్గానికి ఇండ్ల కేటాయింపులు చేసినందుకే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు నాడు కడుపు మండిందని, అందుకే తన ప్రభుత్వ హయాంలో ఇండ్ల కేటాయింపులపై సీబీ సీఐడీ విచారణ చేయించారని మండిపడ్డారు.

80 వేల పుస్తకాలు చదివిన నాటి సీఎం కేసీఆర్, అమెరికాలో పెద్ద చదువులు చదివి వచ్చిన నాటి మంత్రి కేటీఆర్‌కి తమ పదేళ్ల పాలనలో కనీసం నిరుపేదలదకు రేషన్ కార్డులు ఇవ్వాలనే సోయి లేకుండా పోయిందని విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం కొత్తగా 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని, రేషన్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇస్తామని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తిచేయలేకపోయారని, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు సైతం ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ‘గడిచిన 13 నెలల్లో బీఆర్‌ఎస్ అధినేత ఒక్కరోజైనా అసెంబ్లీకి రాలేదు. ఒక ప్రతిపక్షనేత అసెంబ్లీ రాకపోవడమేంటి ? ఆయనకు బాధ్యత లేదా ? బాధ్యత లేకపోతే ఆయనకు పదవి ఎందుకు ?’ అని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ సీఎం ప్రశ్నించారు.

కొడంగల్ నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి, ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం పూనుకొని 1,300 ఎకరాల భూసేకరణ చేయాలని చూస్తుంటే, బీఆర్‌ఎస్ నేతలు అధికారులపై దాడులు చేయించారని ఆరోపించారు. ‘దాడుల వెనుక బీఆర్‌ఎస్ ఆంతర్యం ఏమిటి ? ఎప్పటికీ కొడంగల్ నియోజకవర్గం వెనుకబడే ఉండాలా ? ఇక్కడి యువకులు ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోవాలా ? కొడంగల్‌కు మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీలు రావొద్దా ? మీ ఇంట్లో అందరూ పదవులు అనుభవించారు.

ఏ పదవులు తీసుకోకుండా మా కుటుంబ సభ్యులు ప్రజల కోసం సేవ చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులు నాకు అండగా ఉంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. నేను.. నా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పదవి ఇచ్చానా ? మా కుటుంబ సభ్యులు నిస్వార్థంగా పనిచేస్తుంటే తప్పుపడుతున్నారు. మేం దోపిడీకి మీలాగా దోచుకునే వాళ్లం కాదు.

ప్రజల కోసం పనిచేసే కుటుంబం మాది’ అంటూ కేసీఆర్, కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ధనదాహం కారణంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగినప్పటికీ, తమ ప్రభుత్వం వానకాలంలో రూ.1.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిందని వెల్లడించారు. అంతేకాదు.. సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ సైతం చెల్లించామని స్పష్టం చేశారు. 

నియోజకవర్గ అభివృద్ధికి సొంత నిధులు..

తాను స్వయంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.కోట్ల సొంత డబ్బు వెచ్చించానని, కోస్గి బస్టాండ్ నిర్మాణానికి తన సొంత స్థలం ఇచ్చానని సీఎం గుర్తుచేసుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు దావోస్ నుంచి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని వెల్లడించారు.

ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 12,800 చోట్ల గ్రామసభలు, 3,485 వార్డు సభలు విజయవంతంగా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు.

కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బేన్ షాలమ్, కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్థన్‌రెడ్డి, ఆర్డివో రామచంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోస్గి మండల అధ్యక్షుడు రఘువర్థన్‌రెడ్డి పాల్గొన్నారు.

భూమి లేని వారి కోసమే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’

ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో తాను పాదయాత్ర చేశానని, ఆ సమయంలో గిరిజనులు, ఆదివాసుల్లో ఎక్కువ మందికి భూమి లేదని గుర్తించానని సీఎం గుర్తుచేసుకున్నారు. వారిని ఆదుకునేందుకే తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.

పథకలో భాంగా భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున సాయం అందిస్తామని, పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది భూమిలేని నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కొడంగల్ నియోజవర్గంలో 34 వేల ఇండ్లు నిర్మించామన్నారు.

మార్చిలోపు నియోజవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు అప్పగిస్తామని, అలాగే వచ్చే నాలుగేళ్లలో 15 వేల నుంచి 20 వేల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభల్లో అక్కడక్కడ కావాలనే కొందరు గందరగోళం సృష్టించి, చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.