calender_icon.png 23 April, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు మేము సైతం

21-04-2025 12:32:38 AM

ఎడ్లబండ్లతో బయలుదేరనున్న సూర్యాపేట రైతులు 

 సూర్యాపేట,ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): తెగింపే ఆయుధమై కొట్లాడిన గళం తెలంగాణ కళకు బలమిచ్చిన నినాదం అయింది.ఉద్యమ పార్టీకి 25 ఏళ్లు వచ్చిన సందర్భంగా ఈనెల 27న వరంగల్ లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు మేము సైతం అంటూ ఎడ్లబండ్లతో సిద్ధమవుతున్నారు సూర్యాపేట జిల్లా రైతులు.

ఆదివారం జిల్లా కేంద్రం సూర్యాపేటలో పలువురు రైతులు మాట్లాడుతూ వరంగల్ సభలో కేసీఆర్ మాటలు వినాలని తమ గోడు వెళ్ళబుచ్చుకోవాలని మాజీమంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సారథ్యంలో తాము స్వచ్ఛందంగా సభకు వెళుతున్నామని చెప్పారు.

గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో సంతోషంగా ఉన్నామని,అన్ని రంగాలతో పాటు రైతాంగాన్ని కెసిఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నాడని,స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కాలేశ్వరం జలాలతో ఎండిన చెరువులు నింపి సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేశారని అన్నారు.

మండువేసవిలో కూడా చెరువులు అలుగులు పోసి పంటలు బాగా పండాయని దీంతో అప్పులు తీర్చుకొని నాలుగు పైసలు చేతుల పెట్టుకున్నామని ఆనందంగా చెప్పారు.కాంగ్రెస్,రేవంత్ మాయమాటలకు మోసపోయి గోసపడుతున్నామని,ఇప్పుడు నీళ్లులేక,పంటలు సరిగా పండక మళ్ళీ కూలి పనులకు వలసలు పోయే పరిస్థితి దాపురించిందని వాపోయారు.

అందుకే మాకు కేసీఆర్ పాలనే కావాలని వారం రోజుల ముందుగానే బండెనక బండి కట్టి అన్న పాటను తలపిస్తూ ఈ నెల 22న ఆత్మకూరు(ఎస్)మండలంలోని నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి మొక్కుకొని వరంగల్ బహిరంగ సభకు బయలు దేరబోతున్నామని జిల్లా రైతులు ధీమాగా చెప్పారు.