మనిషి శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు మంచి నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఆందోళన, డిప్రెషన్, మితిమీరిన కోపం నిద్రలేమికి కారణామవుతున్నాయి. మనిషి చేసే చిన్న, చిన్న పొరపాట్లే మంచి నిద్రకు దూరం చేస్తున్నాయి. కచ్చితంగా 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలని చెబుతున్నారు నిపుణులు.
ఆఫీస్ పని గంటలు పెరిగాయో, పెంచుకుంటున్నారో తెలియదు. కానీ ఈ తరంవారు ఆఫీసు పనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అదనపు గంటలతో ఆఫీసులోనే ఉండిపోతున్నారు. రాత్రి తొమ్మిది దాటితేనే ఆఫీస్‌ను వదిలివస్తున్నారు. మళ్లీ ఉదయం పది గంటలకే ఆఫీసుకు చేరుకొని కంప్యూటర్, ల్యాప్‌టాప్‌తో బిజీబిజీగా గడిపేస్తున్నారు. దీంతో నిద్ర గంటలు తగ్గిపోతున్నాయి. పగలనకా, రాత్రనకా ఫోన్‌లు మోగుతుంటే నిద్ర పోవడమనేది సాధ్యపడదు. టెక్నాలజీ వాడకం వల్ల కాంతి కంటిపై పడి నిద్రకు దూరం చేస్తున్నాయి.
మంచి బెడ్
ప్రతిఒక్కరికీ బెడ్ అవసరమే. ఇదివరకు మంచాన్ని నిద్రకు ఉపక్రమించే ముందే వేసుకునేవారు. నిద్రకు వేళాయే అనే విషయం మెదడుకు స్పష్టంగా తెలిసేది. దీంతో నడుము వాల్చగానే నిద్రకు జారుకోవాలనేది మెదడుకు తెలిసిన పని. కానీ నేటి పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. మంచాలు, పరుపులు ఎప్పుడూ పరిచే ఉంటున్నాయి. దీంతో పిల్లలు దీనిపైనే కూర్చుని ఆటలు అడుతున్నారు. ఇక పెద్దవాళ్లు అయితే పనులన్నీ బెడ్‌పైనే పూర్తి చేస్తున్నారు. దీని ఫలితంగా మంచి నిద్రకు దూరమవుతున్నాం. ఇక దంపతులలో నిద్రలేమికి దూరమవుతున్నారు. మంచాన్ని ఎందుకు ఉపయోగించాలో అందుకే ఉపయోగిస్తే నిద్ర సమస్య ఏర్పడదు.
చిట్ చాట్ వద్దు
రాత్రి నిద్ర సమయంలేని సెల్‌పోన్ సంభాషణలు, మెసేజ్‌లతో నిద్రకు పూర్తిగా దూరమవుతున్నారు. పడుకునేటప్పుడు దిండు పక్కనే మొబైల్ స్థానం ఆక్రమించిందంటే మనిషి మొబైల్‌కు ఎంతగా అడిక్ట్ అయ్యాడో అర్థమవుతోంది. నిద్రపోయినప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టుకోవాలి. కానీ ఏ సమయంలో ఫోన్ వస్తుందోననే ఆలోచన, మోగిన ఫోన్‌ను అందుకోవాలన్న అప్రమత్తత మనిషిని నిద్రపోనివ్వడం లేదు.
ఈ జాగ్రత్తలు అవసరం
- రాత్రి భోజనం తర్వాత ఒక అరగంట నడక లేదా చిన్న వ్యాయామం నిద్రకు ఉపక్రమించడం మంచిది. సాయంత్రం వ్యాయామం చేసే అలవాటు ఉంటే ఇంకా మంచిది.
- పుల్లని పండ్లు, కాపీ, టీలను దూరం పెట్టడం మంచిది. గోరువెచ్చని పాలని తాగాలి.
- పడక గది కొంచెం చీకటిగా ఉండేలా చూసుకోవాలి. పడక గదిలో లాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు లేకుండా చేయాలి.
- ఇష్టమైన పుస్తకం చదవడం, ఇష్టమైన సంగీతం వినడం వంటివి చేస్తే త్వరగా నిద్రలోకి జారుకోవచ్చు.
- మద్యం, పొగత్రాగడం వంటివి నిద్రను దూరం చేస్తాయి. కాబట్టి వాటిని ముట్టుకోకపోవడమే శ్రేయష్కరం.
- పడుకునే పరుపు, దిండ్లు విషయంలోనూ తగు జాగ్రత్త అవసరం. సిల్కు వాటికి బదులు కాటన్ వాటికే ప్రాధాన్యతనివ్వాలి. పరుపు ఎప్పుడూ ఒకే దిశలో కాకుండా అట, ఇటు మారుస్తుండాలి.
సూర్యాపేట, విజయక్రాంతి