- ఇప్పటికీ తెలియని 200 మంది ఆచూకీ
- సహాయక చర్యలు కొనసాగిస్తోన్న భారత సైన్యం
- రాడార్లు, డ్రోన్ల సాయంతో జల్లెడ
- ఉత్తరాఖండ్, హిమాచల్‌లోనూ వర్షాల బీభత్సం
వయనాడ్ (కేరళ), ఆగస్టు 3: కేరళలో ప్రకృతి ప్రకోపం పెను విధ్యంసాన్ని సృష్టించింది. వయనాడ్‌లో వరదలు, కొండచరియ లు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 358 మంది మరణించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. బురద మట్టిలో కూరుకుపోయిన దాదాపు 200 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
వీరిని కనిపెట్టేందుకు ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు డీప్ సెర్చ్ రాడార్లను ఉపయోగిస్తున్నారు. కేరళ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు నార్తర్న్ కమాండ్ నుంచి జేవర్ రాడార్, తిరంగా మౌంటేన్ రెస్కూ సంస్థ నుంచి నాలు రీకో రాడార్లను కేంద్రం అందజేసింది. డ్రోన్లలోతూ జల్లెడ పడుతున్నారు. భారత ఆర్మీ చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానికులు సైతం వాలంటీర్లుగా పనిచేస్తుండటం విశేషం.
మృతదేహాల గుర్తింపు కోసం..
మరణించినవారిని గుర్తించేందుకు డీఎన్‌ఏతో పాటు డెంటల్ శాంపిళ్లను సేకరించాలని కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫొటోగ్రాఫ్స్, వీడియోలు కూడా తీయాలని ఆదేశించింది. మృతదేహాలు లేదా శరీర భాగాలను గుర్తించేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ వీలులేకుంటే 72 గంటలు వేచి చూసి తదుపరి చర్యల కోసం జిల్లా పరిపాలనా విభాగానికి అందజేయాలని తెలిపింది. ఈ క్రమంలోనే మూడు గుర్తు తెలియని మృతదేహాలకు కాల్పట్ట శ్మశానంలో అంతక్రియలు చేశారు. వయనాడ్‌లో జరిగిన విధ్వంసాన్ని జాతీ య విపత్తుగా గుర్తించాలని కేంద్రహోంమంత్రి అమిత్ షాను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఆర్మీ యూనిఫాంలో శనివారం వయనాడ్‌ను వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
డేరింగ్ రెస్క్యూ ఆపరేషన్
అత్తమాల అటవీ ప్రాంతంలో ఓ గిరిజన కుటుంబాన్ని కాల్పట్ట ఫారెస్ట్ ఆఫీసర్ హాసిన్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాల్పట్ట అటవీ ప్రాంతంలో కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకుని ఉండడాన్ని హాసిన్ బృందం గమనించింది. నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళ్ల సాయంతో కొండపైకి చేరుకుని గుహలో చిక్కుకుని ఉన్న వారిని రక్షించారు.
అయితే, కొద్ది రోజులుగా వారు ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి ఉన్నారని, తమ వద్దనున్న ఆహారం వారికి తినిపించామని అధికారులు తెలిపారు. అయితే, రెస్క్యూ సమయంలో వారు మాతో వచ్చేందుకు ఒప్పుకోలేదని, సురక్షిత ప్రాంతానికి తీసుకెళతామని నచ్చజెప్పి వారికి కాపాడినట్లు వెల్లడించారు. పిల్లలను తమ శరీరాలకు కట్టుకుని తాళ్ల సాయంతో కొండపైనుంచి కిందకు తీసుకువచ్చినట్లు వివరించారు. అనంతరం వారిని అత్తమాల యాంటీ పోచింగ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ విషయం వైరల్ కావడంతో కేరళ సీఎం పినరయి విజయన్ రెస్క్యూ బృందాన్ని ప్రశంసించారు.
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
ఉత్తరాదిలోని ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో పాటు కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఉత్తరాఖండ్‌లో 15 మంది, హిమాచల్‌లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతు కాగా వారికి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. హిమాచల్‌లోని సమేజ్‌ఖాడ్ గ్రామంలోని తమ ఇల్లు తప్ప ఊరంతా ధ్వంసమైందని ఆ దుర్ఘటన నుంచి బయటపడిన అనితాదేవీ తెలిపింది. కేదార్‌నాథ్ గౌరీకుండ్ రహదారి 13 చోట్ల ధ్వంసం కావడంతో దాదాపు 1,300 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో పలువురు తెలుగు యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది.