calender_icon.png 22 January, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పులు తీర్చేందుకు చోరీల బాట..

01-09-2024 12:44:43 AM

ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

జనగామ, ఆగస్టు 31(విజయక్రాంతి): వ్యాపారంలో నష్టాలు రావడం, దీనికి తోడు అప్పులు బాగా పెరిగిపోవడంతో ఇద్దరు వ్యక్తులు చోరీల బాట పట్టారు. పలు ప్రాంతాల్లో తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడ్డారు. వారిని జనగామ పోలీసులు శనివారం పట్టుకున్నారు. జనగామ పోలీస్ స్టేషన్‌లో డీసీపీ రాజమహేంద్రనాయక్ వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన బంగారి నరేశ్ గోవాలో కొన్నేళ్లు హోటల్ నడిపించాడు. ఆయన కొడుకు అనారోగ్యంతో ఉండటంతో ఆపరేషన్ కోసం భారీగా ఖర్చయింది. అదే సమయంలో గోవాలో హోటల్  సరిగ్గా నడవక అప్పులు చేశాడు.

కొన్ని రోజుల క్రితం వరంగల్‌కు వచ్చి ఉంటున్న నరేశ్‌కు.. వరంగల్ ఏనుమాముల ప్రాంతానికి చెందిన టైలర్ ఆసిఫ్ పాషాతో పరిచయం ఏర్పడింది. ఆయన కూడా టైలరింగ్ సరిగ్గా నడవక అప్పులపాలయ్యాడు. దీంతో ఇద్దరూ కలిసి సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలను ఎంచుకున్నారు. నర్సంపేట, కేయూసీ, భూపాలపల్లి, తొర్రూరు, సుభేదారి, వర్ధన్నపేట, జనగామ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో పోలీసులు నిఘా పెట్టారు.

శనివారం నిందితులు జనగామకు వస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సైలు భరత్, చెన్నకేశవులు యశ్వంతపూర్ ఎల్లమ్మ గుడి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారులో వస్తున్న నరేశ్‌కుమార్, ఆసిఫ్‌పాషాను పట్టుకున్నారు. వారి నుంచి 25 తులాల బంగారం, 137 తులాల వెండి, రూ.3 లక్షల 79 వేల 400, కారును స్వాధీనం చేసుకున్నారు.