- వరుసగా కురుస్తున్న వర్షాలతో ‘లిఫ్ట్’కు దెబ్బ
- వరదతో మునిగిన సొరంగం, సర్జ్‌పూల్, బాహుబలి పంపులు
- నీటిని తోడే పనిలో కాంట్రాక్ట్ సంస్థలు
- ఈ ప్రక్రియకు నెల రోజులు పట్టే అవకాశం
- పేరుకున్న బురద తొలగింపుపైనే సందిగ్ధత
* నీటి తోడివేత 27 రోజుల్లోనే పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. 0.12 టీఎంసీల నీటిని, మడ్డిని తోడిపోయాలంటే నెల రోజులకు పైగా పడుతుంది అని నిపుణులు పేర్కొన్నారు.
హైదరాబాద్/ నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): వరుసగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాన జల వనరైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని వట్టెం సర్జ్‌పూల్, పంప్‌హౌస్‌లో భారీగా వరద నీరు చేరిన విషయం తెలిసిందే. నీటి పారుదల శాఖ అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరితోనే భారీగా నష్టం వాటిల్లిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం 20 కిమీ మేర ఉన్న టన్నెల్‌తో పాటు సర్జ్‌ఫూల్, పంప్‌హౌస్‌లో నిలిచిన వరదను తోడి బయటకు పంపించే పనిలో అధికారులు, కాంట్రాక్టర్, సిబ్బది తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు యంత్రాంగానికి మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తున్నది.
సుమారు నెల రోజుల సమయం..
సర్జ్‌పూల్, పంప్‌హౌస్‌లోని వరదను తోడిపోసేందుకు మరో నెల రోజులకుపైగా సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం కేవలం 27 రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. ప్రస్తుతం 2,300 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న పంప్‌తో నీటిని కుమ్మెర వద్ద వరద నీటిని తోడివేత పనులు సాగుతున్నాయి. మంగళ, బుధవారాల్లో 1,700 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మరో పంప్‌సెట్‌ను ఏర్పాటు చేసి.. నీటిని పంపింగ్ చేస్తామని ఎస్‌ఈ సత్యనారాయణ ‘విజయక్రాంతి’కి తెలిపారు.
మొత్తం 4 వేల హెచ్‌పీ సామర్థ్యం ఉన్న పంపులతో నీటిని 27 రోజుల్లో పంపింగ్ చేస్తామని అంచనా వేస్తున్నామన్నారు. మరోవైపు నిపుణులు మాత్రం 0.12 టీఎంసీల నీటిని, బురదతో కూడిన మడ్డిని తోడిపోయాలంటే కనీసం నెల రోజులకుపైగా పడుతుందని చెప్తున్నారు. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో టన్నెల్‌లో గానీ, ఇతర చోట్ల గానీ లైనింగ్ చేయని ప్రదేశాల నుంచి నీరు టన్నెల్‌లోకి వరద ప్రవేశించే అవకాశం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలాగే ఉంటే మాత్రం పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
బురదే అసలు సమస్య..
నీటిని తోడివేత తర్వాత ఇక అసలు సమస్య ఎదురవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వరద నీటితోపాటు భారీగా బురద కూడా టన్నెల్, సర్జ్‌పూల్, పంప్‌హౌస్‌లో తిష్ఠ వేస్తుందంటున్నారు. వాటిలోకి వరద చేరి ఇప్పటికే వారం, పది రోజులు దాటింది. ఈ చొప్పున బురద ఇప్పుడు అడుగుకు చేరకుని ఉంటుంది. నీటిని తోడేయడానికే నెల రోజులు పడితే.. ఇక ఆ తర్వాత బురదను తొలగించేందుకు మరెంత కాలం పడుతుందోనని ఇరిగేషన్ అధికారులు రంధి పడుతున్నారు. దీనికితోడు అసలు పంప్‌హౌస్‌లో పేరుకున్న బురద తొలగించిన తర్వాతే ఇటీవల బిగించిన నాలుగు బాహుబలి పంపులతో పాటు ప్రస్తుతం బిగిస్తున్న పంప్, మునిగి ఇంకో పంప్ పరిధిలో ఎంత నష్టం జరిగిందన్నది తేలుతుంది.
అలాగే దెబ్బతిన్న ఇతర వస్తువులు, సామగ్రి, యంత్రాల వివరాలు తెలిసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం వరద, బురద తొలగింపు పనులు ఎయిర్ ప్రెషర్‌తో జరుగుతున్నాయి. మున్ముందు బురద గట్టిపడితే ఎయిర్ ప్రెషర్‌తో తొలగించవచ్చా? లేదా ఇతర యంత్రాలు, పరికరాలు ఉపయోగించి తొలగించాల్సి ఉంటుందా? అనేది తేలాల్సి ఉన్నది. ప్రస్తుతం నీటిపారుదలశాఖ అధికారుల పర్యవేక్షణలో కాంట్రాక్టు సంస్థలైన మెగా, బీహెచ్‌ఈఎల్ సంస్థలు నీటి తొలగింపు పనులు వేగవంతం చేశాయి.