calender_icon.png 15 January, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టులకు జలకళ

18-07-2024 03:14:49 AM

  • గోదావరి బేసిన్‌లోని రిజర్వాయర్లకు వరద 
  • ఎగువన కురుస్తున్న వానలతో ఇన్‌ఫ్లో 
  • మేడిగడ్డ లక్ష్మి బరాజ్‌కు పెరిగిన ప్రవాహం 
  • నిండుకుండల్లా తాలిపేరు, కిన్నెరసాని

విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 18: కాస్త ఆలస్యంగా నైనా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. గోదావరి బేసిన్‌లోని పలు ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు కొనసా గుతున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తోడు  ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి వరద వస్తుండటంతో జలకళ సంతరించుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బరాజ్‌కు బుధవారం 49, 500 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది.

అంతే మొత్తంలో అక్కడినుంచి దిగువకు నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 15.90 అడుగులకు చేరుకున్నది. కిన్నెరసాని ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అటు కృష్ణా బేసిన్‌లోనూ కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దీంతో దిగువకు వరద ప్రారంభమైంది. బుధవారం నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదలచేశారు.

సరస్వతి బరాజ్‌లో సీస్మిక్ పరీక్షల నిలిపివేత

కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బరాజ్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరుగుతోంది. బుధవారం 49,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. దీంతో 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా  దిగువకు వదిలేస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి 5.40 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. మానేరు నుంచి 4 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. సరస్వతి బరాజ్‌లో సీస్మిక్ పరీక్షలకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఎగువన మానేరు నుంచి వరద వస్తుండటంతో బరాజ్‌కు ఎగువ, దిగువన 44 జియోఫిజికల్, సీస్మిక్ పరీక్షలను నిలిపివేశారు.

ఓపెన్ కాస్ట్‌ల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

రెండురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి సంస్థకు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్ కాస్ట్‌ల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీకే 2, కేటీకే 3, ఓపెన్ కాస్ట్ ఉపరితల గనుల్లోకి  నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రెండు రోజుల వ్యవధిలో సుమారుగా 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని, సంస్థకు రూ.కోటి మేర నష్టం జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. మల్హర్ మండలం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గనిలో వరదనీరు చేరడం 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికితో పాటు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతకు అంతరాయం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు.

జూరాల కుడి కాలువ ద్వారా నీటి విడుదల 

గద్వాల జిల్లా ధరూర్ పరిధిలోని జూరాల ప్రాజెక్టు కుడి కాలువకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో పాలమూరు కరువు జిల్లాగానే ఉంటూ వలసలు వెళ్లే పరిస్థితి ఉండేదని, నేడు అన్నపూర్ణగా మారిందని చెప్పారు. సాగునీటి అవసరాల కోసం కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసినట్టు తెలిపారు. 

భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటి మట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 11.08 అడుగులకు చేరుకొంది. సుమారు 95,112 క్యూసెకుల నీరు ప్రవహిస్తుంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు 402.60 అడుగులకు చేరుకొని నిండు కుండలా మారింది. కిన్నెరసాని పూర్తి స్థాయి నీటిమట్టం 407 అడుగులు. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టులో నీటి మట్టం 16 అడుగుల వద్ద నిలకడగా ఉంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదనీరు భారీగా చేరుకొంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బుధవారం తాలిపేరును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద నీటికి పూజలు చేశారు. అనంతరం నీటి పారుదలశాఖ అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి 68వేల క్యూసెకుల నీరు విడుదల చేశారు. 

వాగులు పొంగడంతో చేపల వేట

చర్ల మండలంలో వాగులు పొంగి ప్రవహించడంతో చప్టాలపై చేరి జనం చెపల వేటను ప్రారంభించారు. దుమ్మగూడెం మండలంలోని గౌరారం పంచాయతీ తాటివారిగూడెం వద్ద గల గుబ్బలమంగి ప్రాజెక్టు పొంగి ప్రవహించింది. చర్ల మండలం దేవరనగరం కల్వర్టుపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. గ్రామాల్లో జనం వలలుపట్టుకొని చెపల కోసం నీటిలోదిగారు.

జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు 

కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్ఫాలతో కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం ఆల్మట్టి డ్యాం ప్రాజెక్టు గేట్లు తెరుచుకోగా బుధవారం నారాయణపూర్ డ్యాం గేట్లను ఎత్తారు. ఆల్మట్టికి 82 వేల క్యూసెక్యుల ఇన్‌ప్లో ఉండగా 65 వేల క్యూసెక్యుల అవుట్‌ప్లో ఉంది. నారాయణపూర్ డ్యాం 12 గేట్లు ఎత్తి 37,260 క్యూసెక్యుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో జూరాల దిశగా పరుగులు తీస్తున్నాయి. జూరాలకు వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని జల విద్యుత్తు కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించినట్టు జెన్‌కో అధికారులు తెలిపారు.