04-04-2025 10:25:06 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మొక్కలు నాటి సంరక్షించాలని, ప్రతి వర్షపు నీటిబొట్టును వృధా చేయకుండా పొదుపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట వాటర్ షెడ్ ప్రాజెక్టు పరిధిలోని పాడిబండ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన వాటర్ షెడ్ యాత్ర కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ-వాటర్ షెడ్ ప్రత్యేక అధికారి ప్రకాష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, ప్రకృతిని కాపాడుతూ భవిష్యత్తు తరాలకి సహజ వాయువుతో పాటు నీటిని అందించాలని అన్నారు. వాటర్ షెడ్ ఆధ్వర్యంలో వర్షపు నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతలు, ఊట కుంటలు, ఫారం పాండ్ ల ద్వారా పొదుపు చేసేందుకు నిర్మాణ పనులు చేపట్టాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించి వారిని కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాలని అన్నారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని తెలిపారు. అంతకుముందు గ్రామంలో వాటర్ షెడ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రోహిత్ కుమార్,వాటర్ షెడ్ అధికారి ఆంజనేయులు, మాజీ ఎంపిపి మల్లికార్జున్, మాజీ ఎంపిటిసి శంకర్, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.