calender_icon.png 15 January, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట ముంచిన ‘నిర్లక్ష్యం’

08-08-2024 03:57:00 AM

భద్రాచలంలోని పలు కాలనీల్లోకి చేరిన వరద

స్లూయిజ్ కాలువల వద్ద మోటర్లు ఆన్ చేయని అధికారులు

ఫలితంగా నీటమునిగిన రామాలయ ప్రాంగణం, పలు కాలనీలు

మంత్రి తుమ్మలు ఆదేశాలతో పరిస్థితిని చక్కదిద్దుతున్న నీటిపారుదలశాఖ

భద్రాచలం, ఆగస్టు 7: భద్రాచలం ఏజెన్సీలో వారం రోజుల నుంచి భారీగా వానలు కురుస్తున్నాయి. ఫలితంగా గోదావరి ఉప్పొంగుతోంది. ఈ నేపథ్యంలో భద్రాచలం పట్టణంలోకి వరద చేరకుండా నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కరకట్ట వద్దనున్న స్లూయిజ్ కాలువల వద్ద మోటర్లతో వరదను తిరిగి నదిలోకి పంపించాల్సి ఉండగా.. వారు నిర్లక్ష్యం వహించడంతో బుధవారం ముంప్పు కాలనీల్లోకి భారీగా వరద చేరింది. పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణం నీటి మునిగింది.

అన్నదాన సత్రం వద్ద  నడుము లోతు వరద చేరింది.  విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం, మిథిలా స్డేడియం ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో చిరు వ్యాపారుల వ్యాపారం ఆగిపోయింది.  సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాములోరిని దర్శించుకుని తిరిగి కిందికి వచ్చే మార్గంలో వరద నిలిచి ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే పట్టణం ముంపునకు గురైందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల భారీగా వరద వచ్చి సమయంలో వారు స్లూయిజ్‌లు మూసి పట్టణంలోకి బ్యాక్ వాటర్ గోదావరిలోకి మోటర్ల ద్వారా తరలించారని, కానీ వరదలు తగ్గిన తర్వాత వాటిని తెరిచి ఉంచకపోవడంతోనే వరద మళ్లీ పట్టణంలోకి వచ్చిందని ఆరోపిస్తున్నారు. మంత్రి తుమ్మల చివాట్లు పెట్టడంతో తిరిగి పరిస్థితిని చక్కదిద్దారని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం స్పందించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని చిరువ్యాపారులు కోరుతున్నారు.

ఒరిగిన కుసుమ బాబా ఆలయ మండపం..

వరదలో నాని కుసుమ అమరనాథ్ బాబా ఆలయం మండపం ఒక వైపునకు ఒరిగింది. ఒకవేళ మండపం కూలితే పక్కనే ఉన్న నాలుగైదు ఇండ్లు కూడా కూలే ప్రమాదం ఉంది. దీంతో ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్ జితేష్ వీ పాటిల్ వెంటనే పట్టణానికి చేరుకున్నారు. ప్రమాదకకరంగా ఉన్న మండపాన్ని వెంటనే కూల్చివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

మంత్రి తుమ్మల మండిపాటు..

భద్రాచలం రామాలయం సమీపంలోని స్లూయిజ్ కాలువల వద్ద మోటర్లు ఆన్‌చేయకపోవడంమై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం నీటిపారుదల శాఖ అధికారులపై మండిపడ్డారు. ఎందుకు ఆలయ ప్రాంగణంలోకి వరద చేరిందని, ముంపు ప్రాంతాలు ఎందుకు  నీట మునిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దిద్దుబాటు చేర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఆ శాఖ అధికారులు రంగంలోకి దిగి తిరిగి మోటర్లు ఆన్‌చేసి వరదను తిరిగి నదిలోకి మళ్లించారు.