calender_icon.png 29 December, 2024 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలం.. పదిలం

07-10-2024 02:08:35 AM

భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ఇంకుడుగుంతల నిర్మాణాలకు జలమండలి శ్రీకారం

నిరుపయోగ బోర్లను ఇంజక్షన్ బోర్‌వెల్స్‌గా మార్పు

హైదరాబాద్‌సిటీబ్యూరో, అక్టోబర్ ౬ (విజయక్రాంతి) : గ్రేటర్ పరిధిలో భూగర్భ జలాల పెంపు కోసం జలమండలి ‘ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత’ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జలమండలి చేపట్టిన మూడు నెలల ప్రత్యేక కార్యక్రమంలో వీటి నిర్మాణం చేపట్టనున్నారు. నగరంలోని ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతను నిర్మించుకోవాలని అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే అడుగంటిన, నిరుప యోగంగా ఉన్న బోర్లను రీచార్జ్ చేసేందుకు, భూగర్భ జలాలను పెంచేందుకు శ్రీకారం చుట్టింది.  

నిరుపయోగంగా ఉన్న బోర్ల గుర్తింపు 

గత వేసవిలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో తాగునీటితో పాటు గృహావసరాలకు కూడా జలమండలి సరఫరా చేసే ట్యాంకర్లకు డిమాం డ్ పెరిగింది. తిరిగి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికలను జలమండలి సిద్ధం చేస్తోంది. నగరంలోని రోడ్లు, కాలనీలు, ఇళ్ల పరిసరాల్లో ఎక్కువ భాగం కాంక్రీటుతో ఉండటంతో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ వర్షపునీరు భూమిలోకి ఇంకడం లేదు.

ఈ నేపథ్యంలో వరద నీటిని భూమిలోకి పంపి భూగర్భ జలాలను పెంచడంపై జలమండలి దృష్టి సారించింది. జీహెచ్‌ఎంసీ సహకారంతో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడంతోపాటు ఇంజక్షన్ బోర్‌వెల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నగరవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న 3,082 బోర్‌వెల్స్‌ను అధికారులు గుర్తించారు.

నగర పరిధి లో మొత్తం పవర్ బోర్‌వెల్స్ 2796, హ్యాండ్ బోర్‌వెల్స్ 3010 ఉన్నట్లు గుర్తించారు.  వాటిలో వినియోగంలో లేని వాటి దగ్గర ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టి వాటిని పూర్తిగా ఇంజక్షన్ బోర్‌వెల్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇంకుడుగుంత తప్పనిసరి

నగరంలో పడే వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలు పెంపొందిం చడమే లక్ష్యంగా నల్లా కనెక్షన్ ఉన్న ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెడుతు న్నాం. 90రోజుల ప్రతేక కార్యక్రమంలో దీని అమలుపై దృష్టి సారిం చాం. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న  బోర్లు భవిష్యత్తులో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు కోసం ఇంజక్షన్ బోర్‌వెల్స్‌గా పని చేయబోతున్నాయి. ఈ జలయజ్ఞానికి నగరవాసులందరూ సహకరాంచాలి.

  అశోక్‌రెడ్డి, జలమండలి ఎండీ