28-02-2025 12:53:56 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు మొద టగా తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణానదీ యజమాన్య బోర్డు సూచించింది. రెం డు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టి లో పెట్టుకొని, సామరస్యంగా, జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని కేఆర్‌ఎంబీ తెలిపింది. గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్‌ఎంబీ చైర్మన్ అతుల్‌జైన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉ న్న నీటి వినియోగంపై చర్చ జరిగింది. మే నెలాఖరు వరకు తెలంగాణకు 63 టీఎంసీలు, ఏపీకి 55 టీఎంసీలు కావాలని కేఆర్ ఎంబీకి రెండు రాష్ట్రాలు బోర్డు ఎదుట ప్రతిపాదనలు పెట్టాయి. సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించడం అత్యవసరమని, లేదంటే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రతిపాదించగా, ఏపీకి కూడా 55 టీఎంసీలు కావాలని పట్టుపట్టిం ది.
దీంతో బోర్డు జోక్యం చేసుకొని ప్రస్తుతం రెండు రిజర్వాయర్లలో కలిపి 60 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయని, డిమాండ్ల మేరకు నీళ్లు ఇవ్వలేమని ఇరు రాష్ట్రాలకు బోర్డు స్పష్టం చేసింది. తాగునీటి అవసరాలను మినహాయించి తెలంగాణకు 40 టీఎంసీలు, ఏపీకి 20 టీఎంసీలు కేటాయించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. 15 రోజులకోసారి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, అధికారులు సమావేశమై..
నీటి మట్టంపై సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని కేఆర్‌ఎంబీ సూచించింది. కాగా, ప్రస్తుతం సాగర్ నుంచి ఏపీ 7 వేల క్యూసెక్కులు, తెలంగాణ 9 వేల క్యూసెక్కుల నీటిని వాడుకుంటోంది. ఏపీ 5 వేల క్యూసెక్కులనే డ్రా చేయాలని ఆ రాష్ట్ర అధికారులకు బోర్డు సూచించింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 820 ఫీట్ల వరకు, సాగర్‌లో 515 ఫీట్ల వరకే సాగునీటి అవసరాలకు బరాజ్‌లను వాడుకోవాలని, ఆ తర్వాత ఇరిగేషన్‌కు నిలిపివేయాలని బోర్డు స్పష్టం చేసినట్టు తెలిసింది.
అయితే వారం రోజుల తర్వాతే సాగర్ కాలువ నుంచి నీటి విడుదలను 5 వేల క్యూసెక్కులకు పరిమితం చేస్తామని ఏపీ వెల్లడించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. బోర్డు ప్రతిపాదించిన కోటాపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 2,200 క్యూసెక్కుల నీటిని ఏపీ తీసుకుంటుండగా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ 2,400 క్యూసెక్కుల నీటిని వాడుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఏపీకి నాగార్జున సాగర్ ఎడమ కాలువ దారా కూడా నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదన చేయగా, అందుకు తెలంగాణ ఒప్పుకోలేదు.