14-03-2025 12:00:00 AM
జనగామ, మార్చి 13(విజయక్రాంతి): నీళ్లు లేక తమ పంటలు పొట్ట దశలో ఎండిపోతున్నాయని, చెంతనే ఉన్న బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి తమ పొలాలకు నీరు అందించాలని పలువురు రైతులు ఆందోళన చేశారు. గురువారం జనగామ మండలంలో ని వడ్లకొండలో జనగామ హుస్నాబాద్ ప్ర ధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఎండిపోయిన వరిని ప్రదర్శిస్తూ పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు. టైర్లకు నిప్పంటించి రోడ్డుకు అడ్డం గా వేసి వాహనాలు రాకుండా అడ్డుకున్నా రు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా తమ గ్రామంలో కరు వు విలయ తాండవం చేస్తోందన్నారు. నర్మె ట మండలంలోని బొమ్మకూరు రిజర్వాయర్‌లో నీరు ఉన్నప్పటికీ కాల్వల ద్వారా తమ కు అందించడం లేదని వాపోయారు.
ఆ నీటిని పక్క జిల్లాకు తరలిస్తూ ఇక్కడి రైతులు నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుడి కాల్వ అందించాల్సిన నీటిని ఎందుకు పంపింగ్ చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా జనగామ మండలానికి సాగు నీరు అందించి తమ పొలాలను కాపాడాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.