23-02-2025 12:00:00 AM
ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడిచిపోయినా ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం మాత్రం పరిష్కారం కాలేదు సరికదా మరింత ముదురుతోంది. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసి శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండుకుండలుగా మారిన నేపథ్యంలో రెండో పంటకోసం కృష్ణా జలాలను పూర్తిగా వినియోగించుకోవా లన్న రెండు రాష్ట్రాల ఆరాటం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది.
వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పటినుంచి కూడా కృష్ణా జలాల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య తరచూ ఉద్రిక్తతలు కొనసగుతూనే ఉన్నాయి. గతంలో నాగార్జున సాగర్ వద్ద రెండు రాష్ట్రాల పోలీసుల మోహరింపుతో ఉద్రిక్తత నెలకొనడంతో ఈ ప్రాజెక్టు భద్రత బాధ్యతను కేంద్ర సీఆర్ పీఎఫ్ బలగాలు తమ అధీనంలోకి తీసుకునే దాకా వెళ్లింది.
ఆ తర్వాత కూడా శ్రీశైలం ప్రాజెక్టునుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ రిజర్వాయర్‌లోని నీటిని వృధాగా దిగువకు వదిలేస్తోందంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ నిర్వహణ బోర్డు( కేఆర్‌ఎంబీ)కి అనేక సార్లు ఫిర్యాదు చేసింది. 1969 నాటి బచా వత్ ట్రిబ్యునల్ నివేదిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది.
ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు 512: 299 టీఎంసీల నిష్పత్తిలో నీటిని పంచుకోవాలని నిర్ణయించింది. ఆ సమయంలోని నీటి వినియోగ వ్యవస్థల ఆధారంగా ఈ నిర్ణయం జరిగింది. తెలంగాణలోని కరువు ప్రాంతమైన మహబూబ్ నగర్ జిల్లాకు తుంగభద్ర డ్యామ్‌ను ఉపయోగించుకోవాలని కూడా ట్రిబ్యునల్ సూచించింది. అయితే అది ఎక్కడా అమలు కాలేదు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015లో కేంద్ర జలవనరుల శాఖలో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు తాత్కాలికంగా 66: 34 నిష్పత్తిలో కృష్ణా నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించాయి. ఈ ఒప్పందాన్ని ప్రతి సంవత్సరం సమీక్షంచుకోవాలని కూడా నిర్ణయించాయి. అయితే ఎలాంటి సమీక్షలు లేకుండా ఈ విధానం ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చింది.
ఇదే రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమయింది. దీంతో కృష్ణా జలాల్లో తమ రాష్ట్రానికి 70 శాతం వాటా రావాలంటూ తెలంగాణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో ఈ పిటిషన్‌ను తెలంగాణ వెనక్కి తీసుకుంది. 2023 అక్టోబర్ కేంద్రం కొత్త కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్‌కు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది.
అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ సాగు నీటి అవసరాలకోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు ఎగువన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించడంతో మరోసారి ఈ వివాదం వేడెక్కింది. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవనేది తెలంగాణ వాదన.
అయితే తెలంగాణ కూడా అనుమతులు లేకుండానే అనేక ప్రాజెక్టులు చేపడుతోందనేది ఏపీ వాదన. అసలు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిలో తెలంగాణకు 50 శాతం వాటా దక్కాలనేది రాష్ట్రం ప్రధాన డిమాండ్. కానీ దీన్ని ఏపీ వ్యతిరేకిస్తోంది.
అసలు రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి మూల బిందువయిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ఓ పెద్ద చిక్కుముడి.1500 క్యూసెక్కులకు ఆమోదం పొందిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను ఉమ్మడి ఏపీలో చట్టవిరుద్ధంగా సవరించి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ఇప్పుడది 80 వేల క్యూసెక్కులకు పెరిగింది. చెన్నైకి దీనిద్వారా తాగు నీటిని తీసుకెళ్లడానికి 15 టీఎంసీలకే అనుమతి ఉంది.
అయితే 2020 సంవత్సరంలో ఎపీ ప్రభుత్వం 179 టీఎంసీలను తరలించిందనేది తెలంగాణ ఆరోపణ. ఇప్పుడు కూడా అదేవిధంగా అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా రేవంత్ సర్కార్ చూస్తూ ఊరుకుందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఆ రోజు జగన్‌తో కేసీఆర్ దోస్తీ ఫలితమే ఈ దుస్థితి అనేది కాంగ్రెస్ నేతల ప్రత్యారోపణ. ఈ నెల 24న జరిగే కేఆర్‌ఎంబీ సమావేశంలో దీనికి పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి.