02-03-2025 12:00:00 AM
మనిషికి కొన్ని రోజులు ఆహారం లేకపోయినా తట్టుకోగలడు. కానీ ఒంట్లో నీటి శాతం తగ్గితే ఉక్కిరిబిక్కిరి అవుతాడు. సమయానికి నీరు దొరక్కపోతే ఒంట్లోని ప్రతి కణం విలవిల్లాడుతుంది. ఎండలు దంచికొడుతున్న వేళ శరీరానికి నీరు ఏమేరకు అవసరమో.. ఒంట్లో నీటిశాతం ఎందుకు ముఖ్యమో.. తెలుసుకోవాల్సిందే.
ఓ మెడికల్ కాలేజీలో ఓ ప్రొఫెసర్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. ‘వృద్ధుల్లో మానసిక గందరగోళానికి కారణాలు ఏమిటి’? అని ప్రత్యేకంగా ప్రశ్నించాడు. కొంతమంది ‘బ్రెయిన్ ట్యూమర్స్ అని, మరికొందరు ‘అల్జీమర్స్’ అని సమాధానమిచ్చారు. చాలామంది సరైన జవాబు ఇవ్వలేకపోయారు. చివరకు ప్రొఫెసర్ కలుగజేసుకొని ‘డీహైడ్రేషన్’ అని చెప్పడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కాని నిజం.
అయితే సాధారణంగా 60 ఏళ్ల వయసువారిలో శరీరంలో నీటి శాతం 50% కంటే తక్కువగా ఉంటుంది. దాంతో డీహైడ్రేషన్ బారిన పడుతారు. ఒంట్లో నీరు ఇంకిపోతే మాత్రం ప్రతి క్షణం ప్రాణాపాయంగా మారుతుంది. దాహం వేసినప్పుడు గుక్కెడు నీటి కోసమైనా శరీరం సిద్ధపడుతుంది. అయితే ఎక్కువ నీరు తాగినా ప్రమాదమే, తక్కువ తాగినా ఇబ్బందే. అందుకే సమతుల్యమైన నీటి శాతం ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
డీహైడ్రేషన్ ఎందుకంత ప్రమాదం
ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది
మానసిక గందరగోళం
తక్కువ రక్తపోటు
హృదయ స్పందనలు పెరగడం
ఛాతీ నొప్పి
కోమాలోకి వెళ్లడం
తీసుకోవాల్సినవి..
నీరు
పండ్ల రసాలు
టీ
కొబ్బరి నీళ్లు
సూప్‌లు
నీరు అధికంగా ఉండే పండ్లు (పుచ్చకాయ, పైనాపిల్, నారింజ లాంటివి)
ప్రతి రెండు గంటలకు ఒకసారి ద్రవపదార్థాలు తీసుకోవాలి.
ఎక్కువ తాగినా ప్రమాదమే
తీవ్ర వేడి, ఉక్కపోత కారణంగా చాలామంది ఎక్కువ నీరు తాగేస్తుంటారు. ఇది కూడా సరైంది కాదంటున్నారు డాక్టర్లు. దీని వల్ల హైపో నాట్రేమియా వస్తుంది. దాంతో రక్తంలో సోడియం స్థాయిలు తగ్గి, ప్రాణాంతకంగా మారుతుంది. ‘అధిక హైడ్రేషన్ ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి కిడ్నీ సంబంధింత, ఇతర అనారోగ్య సమస్యల బారినపడేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పురుషులు రోజుకు 3.7 లీటర్లు,
మహిళలు 2.7 లీటర్ల నీరు తాగాలి.
నీటి అవసరాలు వయస్సు, జండర్, వాతావరణం, ఆహారం ఆధారంగా మారుతూ ఉంటాయి.