26-03-2025 01:52:05 AM
జనగామ, మార్చి 25(విజయక్రాంతి): జనగామలో నాయకుల చేతగానితనం వల్ల ఇక్కడికి రావాల్సిన అభివృద్ధి పనులు, ఇక్కడి రైతులకు అందాల్సిన సాగునీరు పక్క ప్రాంతాలకు వెళ్తున్నాయని మాదిగ మేధావుల ఫోరం జిల్లా కోఆర్డినేటర్ కరుణాకర్ ఆరోపించారు. స్థానిక పాలకులు, కాంగ్రెస్ నేతలు చేతులు ముడుచుకోవడం వల్లే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు మంగళవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో రూ.200 వందల కోట్ల నిధులతో ఏర్పాటుచేయాల్సిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్టేషన్ ఘనపూర్ కు తరలిపోవడం బాధాకరమన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిర్లక్ష్యం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వార్థం వల్లే జనగామకు అన్యాయం జరిగిందని వాపోయారు.
మరోవైపు జనగామ నియోజకవర్గానికి అందాల్సిన నీటిని బొమ్మకూరు డ్యాము నుంచి పక్క జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తరలించుకుపోయారని గుర్తు చేశారు. ఇంత జరుగుతుంటే జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. జనగామ మండలంలో గానుగుపహాడ్ దగ్గర కల్వర్టు పనులు ఆగిపోతే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. చీటకోడూర్ దగ్గర వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఎన్నో గ్రామాల ప్రజలు విన్నవిస్తున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు జనగామ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లేదంటే ప్రజలే గుణపాఠం చెప్తారని కరుణాకర్ హెచ్చరించారు.