calender_icon.png 22 March, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమే జీవం..ప్రాణ కోఠికి ఆధారం

22-03-2025 12:00:00 AM

  1. పొదుపు చేయకుంటే రేపటి తరాలు శూన్యం
  2. నేడు ప్రపంచ నీటి దినోత్సవం

మంచిర్యాల, మార్చి 21 (విజయక్రాంతి) : మానవునితో పాటు జీవరాశులు బతకడానికి నీరే జీవనాధారం. నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పని నీటి లభ్యత మీదనే ఆధారపడి ఉంటుంది. మానవుని నిర్లక్ష్యం వలన.., నీటి పొదుపు పద్ధతులు పాటించకపోవడం.., నీటి వనరులను పెంచుకోక పోవడం వలన మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.

ఇది ప్రస్తుతం ప్రపంచలోనే ఎన్నో దేశాలను పట్టిపీడిస్తున్న, ఎంతో తీవ్రమైన సమస్య. 2025 సంవత్సరం నాటికి దాదాపు యాభై దేశాలలో నీటి కొరత తీవ్రరూపం దాలుస్తుందని ఐక్యరాజ్యసమితి గతంలోనే హెచ్చరించింది. సమీప భవిష్యత్తులో మన భారతదేశం కూడా ఉండటం దురదృష్టకరం.

1992లో బ్రెజిల్ లోని రియోడిజి నీ రియాలో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ అభివృద్ధి సంస్థ సదస్సులో నీటి సమస్యను గుర్తించి ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా నిర్వహించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కలిగించాలని నిర్ణయించింది. 2021 నుంచి వ్యాల్యూయింగ్ వాటర్ పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

జలమే బలం.. జీవ కోటికి ప్రాణాధారం...

భూగోళంపై మనుగడ సాగిస్తున్న కోట్లాది ప్రాణులకు నీరే ప్రాణాధారం. మన పూర్వీకులు నీటి వనరులున్న చోటే జనావాసాలు ఏర్పరచుకొని అభివృద్ధి చెందాయి. నాగరికత అభివృద్ధి చెందాలంటే మానవ జీవితానికి ఆర్థిక బలాన్ని, అభివృద్ధిని చేకూర్చే అతి విలువైన వనరులు నీరు మాత్రమే. మన నిత్య జీవింలో చేసే ప్రతి పని నీటి చుక్కలు పైన ఆధారపడి ఉందనేది చారిత్రక సత్యం.

సకల జీవులకు అవసరమైన నీటిని మానవ తప్పిదాలతో అవసరం కన్నా ఎక్కువగా విచ్చలవిడిగా వినియోగిస్తూ  నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన నీటి సమస్యకు కారణం అవుతున్నాం. జలాశయాలు, నదులు, సముద్రాలను సైతం కలుషితం చేస్తూ నిర్జీవంగా మార్చేస్తున్నాం. మానవ తప్పిదాల వలన అనేక ప్రాణులు కనుమరుగవుతున్నాయి.

నీటిని ఇలా పొదుపు చేద్దాం

కాలకృత్యాలకు అవసరమైనంత నీటిని మాత్రమే ఉపయోగించాలి. కుళాయిలు  ఉపయోగించిన వెంటనే నిలుపుదల చేయాలి. కూరలు పండ్లు కడిగేటప్పుడు అవసరమైన నీటినే వాడాలి. బట్టలుతికే సమయంలో కుళాయిని ఆపి నీటి వృదాను అరికట్టాలి. రాత్రిపూట బిందెల నీళ్లు వృధాగా పారవేయకుండా మొక్కలకు, ఇతర అవసరాలకు వినియోగించాలి. నీటి లీకేజీని వెంటనే అరికట్టాలి.

నీటి కాలు ష్యాన్ని  నివారించాలి. ఇంకుడు గుంతలు నిర్మించుకునే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. రహదారుల పక్కన ఇంకుడు గుంతలు నిర్మించి వాన నీటిని పొదుపు చేయాలి. చెరువులో పూడిక తీసి నీటి నిల్వలు పెంచాలి. కనీసం 3 నుంచి 5 మీటర్ల లోతు ఇసుక నిల్వలు ఉండాలని చెప్పే వాల్టా చట్టాన్ని అతిక్రమించిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు విధించాలి. 

మన నీరు.. మన బాధ్యత

రేపటి తరాలకు నీరుండాలంటే పొదుపు చేసుకోవడం, నీటి వనరులు పెంచుకోవటం తప్పనిసరి. మన ప్రవర్తనలో మార్పు రాకుంటే ఇంకా ఎంతోకాలం ఈ భూగోళంపై బ్రతకలేము అనేది నిప్పులాంటి నిజం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రకృతిలో సహజంగా పునరుద్ధరింప బడే సహజ వనరు అయిన నీరు పునరుద్ధరింపబడని వనరుగా మారే ప్రమాదం అతి చేరువలో ఉందని పర్యావరణ వేత్తలు, భూగర్భజల నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పుష్కలంగా లభించే నీటిని ప్రస్తుతం డబ్బాలలో, సీసాలలో కొనుక్కునే దుస్థితి ఏర్పడింది. ప్రకృతి ఇచ్చిన వరం నీరు.., అందరికి పంచి పెట్టాల్సిన బాధ్యత మనందరిది... ఒక నీటి చుక్కను పొదుపు చేస్తే.. ఒక నీటి చుక్కను మనం ఉత్పత్తి చేసినట్టే... అనే  సంకల్ప బలంతో ఇకనైనా జీవనాధారమైన మానవుని మనుగడ కోసం.., సకల ప్రాణుల కోసం అత్యవసరమైన నీటి సంరక్షణను, నీటి పొదుపును ఈ రోజు నుంచైనా ప్రారంభిద్దాం.

  గుండేటి యోగేశ్వర్, పర్యావరణ వేత్త, మంచిర్యాల