అకాల వర్షాలకు కల్లాల్లో తడిసిన వడ్లు
కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకుల కొర్రీలు
తేమపేరుతో వడ్లు కొనేందుకు నిరాకరణ
కంటనీరు పెట్టుకుంటున్నరైతాంగం
తాము పండించిన వరిధాన్యం పలుమార్లు కల్లాల్లో వర్షానికి తడుస్తుండడంపై రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల కొర్రీలు రైతులకు శాపంగా మారాయి. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యంలోకి వర్షపు నీరు చేరింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిరాకరించడంతో రైతులు ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వాన
స్తంభించిన జనజీవనం.. హైవేల్లో భారీగా ట్రాఫిక్ జాం
ప్రధాన మార్గాలపై విరిగిపడిన చెట్లు
మెదక్ జిల్లాలో అత్యధికంగా 80 మి.మీ వర్షపాతం నమోదు
నేడూ రేపూ వర్ష సూచన.. వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ శాఖ
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): అకాల వర్షంతో తెలంగాణ అతలాకుతలమైంది. గురువారం మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో తడిసిన ధాన్యాన్నీ రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల రోడ్లపై చెట్లకొమ్మలు, చెట్లు విరిగిపడ్డాయి.
చందుర్తి మండలంలో రోడ్డుపై చెట్టు విరిగిపడింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన దారుల్లో భారీగా వరద నీరు నిలిచింది. తుర్కాసిపల్లెలో చెట్టు విరిగి ఇండ్లపై పడింది. గాలిదుమారానికి పలుచోట్ల ఇంటిపై రేకులు, గూనపెంకులు లేచికిందపడ్డాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బిలాల్‌పూర్, మనియార్‌పల్లి, పైడిగుమ్మల్, బడంపేట వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల చేతికొచ్చిన వరి పైరు నేలమట్టమైంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వెలికట్ట, దుద్దెడ, అంకిరెడ్డిపల్లి, చేర్యాల మండలంలో వర్షం తీవ్రత ఎక్కువగా కనిపించింది.
కొండపాక మండలం మధిర సార్లపల్లిలోని ఓ తాటి చెట్టుపై పిడుగుపడింది. కరీంనగర్ జిల్లాకేంద్రంతోపాటు చొప్పదండి, హుజురాబాద్, మానకొండూర్ ప్రాంతంలో మోస్తరు వర్షం కురిసింది. జనగామ జిల్లాకేంద్రంలో అరగంట పాటు వర్షం దంచికొట్టింది. దీంతో హైదరాబాద్ మార్గం జలమయమైంది. డ్రైనేజీ కాలువల్లోని మురుగు రహదారిపై ప్రవాహించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంతో పాటు రెబ్బెన మండలంలో మోస్తరు వర్షం కురిసింది. సిర్పూర్(టి) మండలంలో భారీవర్షం కురిసి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
అత్యధికంగా మెదక్ జిల్లా శంకర్‌పేట 80 మి.మీ వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలోని మిన్‌పూర్‌లో 29.0 మి.మీ, సంగారెడ్డిలోని వట్టేపల్లెలో 26.3 మి.మీ, సంగారెడ్డి 23.0 మి.మీ, సిద్దిపేటలోని వర్గల్ మండలంలోని గౌరారం గుండ్లలో 17.3 మి.మీ, సంగారెడ్డి జిల్లా హత్నూర్‌లో 17.3 మి.మీ, వికారాబాద్‌లో కొండగల్‌లో 14.3 మి.మీ, రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లిలో 14.5 మి.మీ, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల 14.0 కుమ్రం భీం జిల్లాలోని త్రియానిలో 12.5 మి.మీ, మేడ్చల్ మల్కాజిగిరిలో దేవరయాంజిల్‌లో 12.3 మి.మీ, వికారాబాద్‌లోని మన్నెగూడలో 11.5 మి.మీ, ఆదిలాబాద్‌లోని గుడిహత్నూర్‌లో 10.8 మి.మీ, వికారాబాద్‌లో బషీరాబాద్‌లో 10.0 మి.మీ, ఆదిలాబాద్ నార్నూర్‌లో 9.5 మి.మీ, కామారెడ్డిలోని మంచెపూర్‌లో 9.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
మరోవైపు కొన్నిచోట్ల ఎండల తీవ్రత కనిపించింది. జగిత్యాల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలు, అత్యల్పంగా మెదక్ జిల్లాలోని శంకరపేటలో 20.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైందని వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలో 41.8, నల్లగొండలో 40.5, వరంగల్‌లో 40.2, నిజామబాద్ 40.0, ఖమ్మంలో 39.8, రంగారెడ్డి 39.8, ఆదిలాబాద్ 39.8, హైదరాబాద్ 39.7, మెదక్‌లో 39.3 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో రెండు రోజులు వర్ష సూచన
ద్రోణి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వానల నేపథ్యంలో కుమ్రం భీం, మంచిర్యాల, జగిత్యాల,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, ములుగు, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నారాయణపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశామన్నారు.
ఏపీలో రెండు రోజుల పాటు వానలు
హైదరాబాద్, మే 16(విజయక్రాంతి): ద్రోణి ప్రభావంతో ఏపీలోని గురువారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో 50.5 మి.మీ, నెల్లూరు జిల్లా ఓలేటివారిపాలెంలో 48.2 మి.మీ, నంద్యాల జిల్లా నందికొట్కూరులో 47.2 మి.మీ, నెల్లూరు లింగసముద్రం గుడ్లూరులో 39.5 మి.మీ, తిరుపతి జిల్లానాయుడు పేటలో 27 మి.మీ, నెల్లూరు జిల్లా కనిగిరిలో 26.5 మి.మీ, ప్రకాశం మర్పిపూడిలో 24.5 మి.మీ, అనకాపల్లి పాయకారావు పేటలో 23 మి.మీ వర్షపాతం నమోదైంది.
శుక్రవారమూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్సార్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. పోలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణశాఖ సూచిస్తున్నది.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
రాజన్న సిరిసిల్ల, మే16 (విజయక్రాంతి): పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేర్వేరు చోట్ల చోటుచేసుకున్నది. వేములవాడ మున్సిపాలిటీలోని శాత్రాజుపల్లికి చెందిన పలువురు గురువారం మధ్యాహ్నం పలువురు చింతచెట్టు ఎక్కి చింతకాయలు కోస్తున్నారు. ఈక్రమంలో ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమై చెట్టుపై పిడుగుపడింది. ఘటనలో కంబల్ల శ్రీనివాస్(30) తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
ఘటనలో దేవయ్య, శ్రీనివాస్, కొమురవ్వ, ఎల్లయ్య అస్వస్థతకు గురికాగా స్థానికులు క్షతగాత్రులను ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా మృతుడు శ్రీనివాస్‌కు భార్య, రెండు నెలల కూతురు ఉన్నారు. అలాగే తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెందిన రుద్రారపు చంద్రయ్య (43)అనే రైతు పొలానికి వెళ్లి పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అదేచోట పిడుగుపడి రైతు తీవ్ర అస్వస్థతతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య కళావతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.