calender_icon.png 11 January, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలం వచ్చింది.. జీవిక దొరికింది!

17-12-2024 12:00:00 AM

గ్రామీణ మహిళలు నీటి కోసం కిలోమీటర్లు నడిచి వెళ్తున్న సందర్భాలెన్నో. తాగునీటి కోసం నదులు, బావులు, ఇతర నీటి వనరులపై ఆధారపడాల్సిన దుస్థితి. కుటుంబానికి అవసరమైన నీటిని తీసుకురావడంలో మహిళలదే ముఖ్యపాత్ర. అయితే నీటి ఎద్దడి కారణంగా తాగునీటి కోసం గంటల తరబడి వెచ్చించే పరిస్థితి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ మహిళలకు గేమ్ ఛేంజర్‌గా మారింది. ప్రతి ఇంటిలో జలధార ప్రవహిస్తుండటంతో మహిళలు వ్యవసాయంతోపాటు, ఇతర అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. 

ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’ పేరిట 2020లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామాల్లో మరమ్మతులకు గురైన నీటి పథకాలను బాగు చేయడంతోపాటు కనీస తాగునీటి సదుపాయం లేని పల్లెలకు కొత్తగా తాగునీటి సదుపాయాలు కల్పించడం ముఖ్య ఉద్దేశం.

అలాగే ఆయా గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీటిని అందించడమే లక్ష్యం. అయితే ప్రతి ఇంటికి సకాలంలో నీరు అందుతుండటంతో మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. నీటి కోసం మైళ్ల దూరం నడిచే సమయాన్ని ఆర్థిక అవసరాలకు కేటాయిస్తున్నారు.

నీటి కష్టాలకు చెక్

ఒక గ్రామీణ మహిళ నీటి కోసం సంవత్సరానికి 14,000 కి.మీ కంటే ఎక్కువ నడిచి వెళ్తున్నట్టు ఎస్‌బీఐ లాంటి నివేదికలో తేలింది. మన దేశంలోని వివిధ పట్టణ ప్రాంతాల్లోని మహిళలు అంత దూరం నడవకపోయినా.. గంటల తరబడి క్యూలో నిలబడి రోడ్డు పక్కన కుళాయిలు, ట్యాంకర్ల నుంచి నీటిని తెచ్చుకునేవారు.

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు సగటున రోజుకు మూడు నుంచి నాలుగు గంటలపాటు తాగునీటి కోసం వెచ్చిస్తున్నారు. నీటి కష్టాల కారణంగా మహిళల సామర్థ్యం ఇతర రంగాలకు ఉపయోగపడలేకపోయింది. జల్ జీవన్ మిషన్ రాకతో గ్రామీణ మహిళల బతుకు చిత్రమే మారింది. ఈ కీలకమైన సమయాన్ని ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగించుకుంటూ శక్తివంతంగా మారుతున్నారు. 

సాధికారత దిశగా..

జల్ జీవన్ మిషన్ రాకతో మహిళలు సుదూరం వెళ్లాల్సిన బాధలు తప్పాయి. ఈ నేపథ్యంలోనే మహిళలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామ, నీటి పారిశుధ్య కమిటీల్లో మహిళలు 50 శాతం రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఫలితంగా నీటి సరఫరా పథకాల సంబంధిత ప్రణాళికల రూపకల్పన, అమలు, యాజమాన్యం, నిర్వహణ తదితరాల్లో ప్రతిదాన్నీ ముందుండి నడిపిస్తున్నారు.

ప్రతి గ్రామంలో నీటి నాణ్యత నిఘా కమిటీల్లో ఐదు మందికి పైగా మహిళలకే అవకాశం ఉండటం విశేషం. దీంతోపాటు అనేక మంది మహిళలు ప్లంబర్లు, మెకానిక్లు, పంపు ఆపరేటర్లు తదితర వృత్తుల్లోనూ రాణిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా ఇలాంటి కొత్త బాధ్యతల్లో మహిళలు చురుగ్గా పాలు పంచుకుంటున్నారు.

‘జల్ జీవన్ మిషన్’ అనే ఈ ఆలోచన కేవలం జల రంగాన్నే కాకుండా ఇతర అనుబంధ రంగాలనూ ప్రభావితం చేస్తోంది. మనదేశంలోని కొంతమంది మహిళలు ఐటీ రంగంవైపు అడుగులు వేస్తున్నారు. కష్టసాధ్యమైన రంగాల్లో రాణిస్తూ మగవారితో సమానంగా పనిచేస్తున్నారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారు. 

ఆర్థికాభివృద్ధి..

ఒకప్పుడు నీటి వనరుల కొరత కారణంగా చాలామంది మగవారు కూలీలుగా పనిచేసేవారు. ఇందుకోసం దేశ రాజధాని ఢిల్లీ, ఇతర నగరాలకు కూలీ పనుల కోసం వలస వెళ్లేవారు. జల్ జీవన్ మిషన్ లో భాగంగా చెరువులు నిండటంతో సొంతూరులోనే పంటలు పండిస్తూ ఆర్థికంగా లాభపడుతున్నారు.

పురుషులతో పాటు మహిళలు వ్యవసాయ పనులు చేస్తున్నారు. వ్యవసా యంలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం వల్ల కూలీ, ఇతర ఖర్చలు తగ్గాయని చాలామంది రైతులు చెబుతున్నారు. జల్ జీవన్ మిషన్ కారణంగానే తాము ఆర్థికాభివృద్ధి సాధించామని 78 శాతం మహిళలు చెబుతుండటం విశేషం.