calender_icon.png 3 March, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్లు పాతాళంలోకి.. నిధులు ఢిల్లీకి

02-03-2025 12:55:45 AM

  1. నియామకాలనూ గాలికి వదిలారు
  2. రేవంత్ చరిత్రంతా బ్యాగులు మోయడమే
  3. ఏడాదిలోనే లక్షా 50 వేల కోట్ల అప్పు 
  4. చేసిన అభివృద్ధి ఏమీ కనిపించడం లేదు
  5. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మేలు
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి హయాంలో నీళ్లు పాతాళానికి, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని.. నియామకాలను గాలికి వదిలేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అప్పుడు చంద్రబాబుకు.. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానానికి.. రేవంత్ చరిత్రంతా బ్యాగులు మోయడమేనని ఎద్దేవా చేశారు.

చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండల మాజీ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డితో పాటు సుమారు 500 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణకు లక్షా 50 వేల కోట్లు కేటాయించి, అందులో వచ్చే  కమీషన్లను అధిష్ఠానానికి పంపి.. తన పదవిని కాపాడుకోవాలని చూస్తున్నారన్నారు.

మంచి మైక్‌లో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలంటున్న రేవంత్ ఒక్క మంచి పని చేయలేదు కాబట్టే ఎవరూ మైక్‌లో చెప్పడం లేదన్నారు. హైడ్రా విధ్వంసం, ఆర్‌ఆర్ టాక్స్, భూకబ్జాలు, అంతులేని అవినీతితో కుప్పకూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు, మునిగిన వట్టెం పంప్‌హౌస్ ఇలా చెప్పుకుంటూపోతే రేవంత్ చెవుల నుంచి రక్తం కారుతుందన్నారు.

రుణమాఫీ, పెన్షన్లు, రైతు భరోసా, ఆడబిడ్డలకు తులం బంగారం, కల్యాణ లక్ష్మి పథకాలన్నింటిని నిలిపేశారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో విధ్వంసం, అరాచకాలతో కుప్పకూలిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు సం బంధించి కేసీఆర్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయని, 10 శాతం పనులు చేస్తే చేవెళ్లకు నీళ్లు వస్తాయన్నారు.

కేసీఆర్‌కు పేరొస్తుందనే అసూయతో పనులను పూర్తి చేయడం లేదని విమర్శిం చారు. మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే రూ.1,50,000 కోట్ల అప్పుచేసి, ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రారంభించకుండా ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

450 మంది రైతులు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. రాబోయే పంచాయతీ, ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.