- జీవో పరిధిలో యథేచ్ఛగా వెంచర్ల ఏర్పాటు
- సామాన్యులకు అంటగడుతున్న అక్రమార్కులు
- అన్నీ తెలిసినా పట్టించుకోని అధికారులు
- అందిన కాడికి దండుకుంటున్నా అడిగే నాథుడు కరువు
- అక్రమార్కులకు అన్ని విధాలుగా అధికారుల సహకారం
రాజేంద్రనగరి, ఫిబ్రవరి2: జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన 111 జీవో నిబంధనలను అక్రమార్కులు తుంగలో తొక్కుతున్నారు. తమ ఇష్టారాజ్యంగా 111 జీవో పరిధిలో వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. అడ్డగోలుగా దందా చేస్తూ సామాన్యులకు ప్లాట్లు అంట గడుతున్నారు. కోట్లు దండుకుంటూ తమ జేబుల్లో నింపుకొంటున్నారు.
అన్నీ తెలిసినా అధికారులు ఏమీ పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 111 జీఓ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్ల నిర్వాహకుల నుంచి అధికారులు అందిన కాడికి దండుకుంటున్నారని ఆరోపణలు లేకపోలేదు.
మల్కారంలో భారీ వెంచర్..
శంషాబాద్ మండల పరిధిలోని మల్కారం గ్రామంలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా భారీ వెంచర్ను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ప్లాటింగ్ హద్దులు కూడా ఏర్పాటు చేసి వెంచర్ నుంచి జె బి ఐ టి వెళ్లే ప్రధాన రహదారి వరకు డ్రైనేజీ పైప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. రేయింబవళ్లు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
అయితే 111 జీవో నిబంధనల ప్రకారం శంషాబాద్ మండల పరిధిలోని ఏ గ్రామంలో కూడా వెంచర్లు ఏర్పాటు చేయొద్దు. అయితే అధికారుల చేతులు తడిపితే ఏదైనా సాధ్యమేనని తెలుస్తోంది. మల్కారం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న భారీ వెంచర్ గురించి మండల అధికారులకు అన్ని తెలిసినా కూడా తమకు ఏమీ తెలియనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ వాటిని కూల్చివేయాల్సిన ఎంపీఓ, ఇతర అధికారులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తుత్తి చర్యలకే పరిమితం..
మీడియాలో కథనాలు వస్తే అధికారులు ఉత్తుత్తి చర్యలు తీసుకుంటున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. హడావిడిగా నోటీసులు జారీ చేయడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు వెంచర్లను పూర్తిచేసి దర్జాగా సామాన్యులకు ప్లాట్లను అంటగడుతున్నారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన జిల్లా స్థాయి అధికారులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
స్పందించని ఎంపిఓ
మల్కారం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న భారీ వెంచర్ విషయమై ఎంపీవో ఉషా కిరణ్ రెడ్డిని వివరణ కోరగా పర్మిషన్ లేదని తెలిపారు. అనంతరం ఆమె ఈ విషయమై వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. వెంచర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని కూడా అడగడం గమనార్హం. అధికారులకు అన్నీ తెలిసినా కూడా పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నిర్లక్ష్యపు నిద్రమత్తు వీడి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.