calender_icon.png 22 October, 2024 | 3:57 PM

పదిరోజుల్లో బ్రాహ్మణవెల్లంలకు నీళ్లు

22-10-2024 12:58:28 AM

  1. రెండేళ్లలో ఎస్సెల్బీసీ పూర్తే లక్ష్యం
  2. మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, అక్టోబర్ 21 (విజయక్రాంతి): పది రోజుల్లో బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును కృష్ణానీటితో నింపుతామని రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ గ్రామీణ మండలం ఖాజీరామారం, మాడుగులపల్లిలో సోమవారం పంచాయతీ భవనాల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఆయాచోట్ల ఏర్పాటు చేసి సమావేశంలో మాట్లాడా రు. నల్లగొండ జిల్లాను సస్యశ్యామలంగా మార్చేందుకు ఎస్సెల్బీసీ సొరంగాన్ని 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జిల్లాలో పంచాయతీ రాజ్ రోడ్లకు మంత్రి సీతక్కతో మాట్లాడి రూ.15 కోట్లు మంజూరు చేయించినట్టు గుర్తుచేశారు.

ఖాజీరామారానికి తన హయాంలోనే బీటీ రోడ్డు వేయించానని, విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించామని, ఇటీవల డీ కాల్వ మరమ్మతులను ప్రారంభించామని గుర్తుచేశారు. ఖాజీరామారం రహదారి మరమ్మతు, పావురాలగూడెం రహదారి నిర్మాణానికి రూ. కోటి చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

మాడుగులపల్లి పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణానికి మూడెకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాడుగుల పల్లిలో వరద కాల్వను పరిశీలించి, మర్రిగూడెం కుంట నుంచి నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లను ప్రారంభించారు. 

పోలీసు అమరుల త్యాగాలు మరువలేవివి : మంత్రి 

పోలీసు అమరుల సంస్మరణ దినోత్స వం సందర్భంగా నల్లగొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అమరులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాళులర్పించారు. జిల్లాలోని పోలీస్ అమరుల కుటుంబాలకు  సీఎంతో మాట్లాడి ఆర్థిక సాయం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు. 15 మంది కుటుంబాలకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరుఫున రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

ప్రభుత్వం తరఫున అమరుల కుటుం బాలకు రూ.10 వేల చెక్కు అందించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ నారాయణరెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర, ఆర్డీవో శ్రీదేవి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.