21-02-2025 01:13:15 AM
కృష్ణా నీరు ఏపీ పాలు ఢిల్లీలో ధర్నా చేద్దామా?
* కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్నా ఇదేమిటని రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు. తెలంగాణ సోయిలేని ప్రభుత్వం ఇది.
బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ర్ట సాగు నీరు, తాగు నీరు ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
మూడు నెలలుగా నాగా ర్జునసాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభు త్వం రోజు 10వేల క్యూసెక్కుల నీళ్లు తరలించుకుపోతుంటే, తెలంగాణ ప్రభు త్వం చేవచచ్చి, చేష్టలుడిగి చేతులు కట్టు కొని చూస్తున్నదని, నీళ్ల మంత్రి నీళ్లు నములుతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. ‘కేంద్ర జలశక్తి, కేఆర్‌ఎంబీ ఆఫీ సు ముందు ధర్నా చేద్దాం పదండి.. మీకు చేతగాకుంటే మీ వెంట మేమూ వస్తాం.. అఖిలపక్షాన్ని తీసుకుపోండని’ ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్‌లో గురువారం మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, వేసవిలో తాగునీటి సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ సోయిలేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంతటి నష్టం జరుగుతుందో ఇవాళ కళ్ల ముందు కనబడుతున్నదని ఆయన మండిపడ్డారు.
కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టిఎంసీలు, కానీ ఇప్పటివరకు 657 టీఎంసీలు తరలిస్తే మీ నోరు పెగలదా? మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? అని ప్రశించారు. గడిచిన 25 రోజుల్లోనే 60 టిఎంసీలు తరలించారన్నారు. సీఆర్పీఎఫ్ బలగాల చేతిలో ఉన్న ప్రాజెక్టు నుంచి ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లు తరలిస్తున్నదని చెప్పారు.‘
కేంద్రాన్ని అడుగవు, చంద్రబాబును అడుగవు.. వారిని అడిగే ధైర్యం సీఎం కు లేదు’ అన్నారు. తెలంగాణకు 343 టీఎంసీల నీళ్లు రావాలని, కానీ ఈరోజుకు తెలం గాణ వాడుకున్నది 220 టీఎంసీలేనన్నారు. శ్రీశైలం, సాగర్‌లో కలిసి ఉన్న నీళ్లు 100 టీఎంసీలు మాత్రమేనన్నారు. యాసంగి పంటకు నీళ్లు ఇస్తామని కోట్లు పెట్టి పత్రికల్లో యాడ్స్ వేసుకున్నారని విమర్శించారు.
సాగర్ ఎడమ కాల్వ కింద నల్లగొండలో లక్షా 45 వేల ఎకరాలు, సూర్యపేటలో 2లక్షల 35వేల ఎకరాలు, ఖమ్మంలో 2లక్షల పైగా ఎకరాలు, మొత్తంగా 6లక్షల 38వేల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకున్నరని, నాలుగు తడుల నీళ్లు ఇస్తే గాని అక్కడ పంటలు పండవని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యపేట, హైద్రాబాద్ తాగునీటికి నాగార్జునసాగర్‌పై ఆధారపడి ఉందన్నారు.
ఇప్పటికైనా కండ్లు తెరవాలని, రైతుల పంటలు కాపాడాలంటే తక్షణం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఏపీ జలదోపిడిని తక్షణం అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే సాగర్ కుడి కాల్వకు నీళ్లు విడుదల ఆపాలని, పోతిరెడ్డిపాడు ద్వారా తరలిస్తున్న నీటిని ఆపాలన్నారు.
రెండు పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. కాళేశ్వరం కూలి పోయిందని దొంగ ప్రచారం చేశారని, కాళేశ్వరంలో అనేక భాగా లు ఉన్నాయని, ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పియ్యర్ కుంగిందని, దాన్ని రిపేర్ చేయకుండా చోద్యం చేస్తున్నారన్నారు.
అంతా మీ అసమర్థతే కుమ్మక్కు అయ్యారుగా?
* గతంలో ఏపీ ప్రభుత్వంతో అలాయ్ బలాయ్ చేసుకున్న బీఆర్‌ఎస్ పాలకులు ఉల్లంఘనలపై నోరు మెదపలేదు. టెలిమెట్రీ కూడా పెట్టలేదు.
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : సాగునీటి ప్రాజెక్టుల విషయం లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు పూర్తి వైఫల్యం చెందడమే కాకుండా.. ఏపీ జల దోపిడీకి పూర్తిగా సహకరించారని, కృష్ణా నది జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ బీఆర్‌ఎస్ పాలనలోనేనని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును రూ. లక్ష కోట్ల ఖర్చుతో నిర్మించారని, అయినా ఆ ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కూలిపోయిందన్నారు. ఆ ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు.. కానీ వారి జేబులు నిండాయని చెప్పారు. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టుకూడా రాలేదన్నారు. గురువారం జలసౌధలో మీడియా సమావేశం లో మంత్రివర్గ సహచరులతో కలిసి మంత్రి ఉత్తమ్ మాట్లాడారు.
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగొద్దని తాను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు వివరిస్తే.. ఆయన సానుకూలంగా స్పందించినట్టు మంత్రి ఉత్తమ్ తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల విషయం లో పూర్తిగా వైఫల్యం చెందిన బీఆర్‌ఎస్ నేతలు పదేండ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ.. కనీసం టెలిమెట్రీకూడా ఏర్పాటుచేయలేక పోయారని మంత్రి ఆవేదన చెందారు.
తద్వారా ఏపీ జల దోపిడీకి అప్పటి ప్రభుత్వ పెద్దలు సహకరించారని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి పూర్తిచేయలేదని, పదేండ్ల కాలంలో నీటి కేటాయింపులు సాధించలేదంటూ విరుచుకుపడ్డారు. కనీసం శ్రీశైలం, నాగార్జున సాగర్ రిపేర్లనుకూడా చేయలేదని తమ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తరువాత తామే ఆ పనులను చేపట్టి ముందుకు తీసుకెళుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
అప్పుడు ఏపీతో అలయ్ బలయ్ చేసుకున్నారు..
కృష్ణా నదీ జలాలు ఆంధ్ర పాలకులు ఉల్లంఘనలను అతిక్రమించి దోచుకుపోతుంటే సహకరించిన పాలకులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. టెలిమెట్రీ పరికరాలు అమర్చాలని చట్టంలో ఉన్న ప్పటికీ ఆంధ్రా పాలకుల నీటి దోపిడీకి సహకరించేందుకే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమర్చలేదని మంత్రి ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్‌ఎస్ పాలకులు చేసిన అప్పులు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పెనుభారంగా పరిణమించాయని మంత్రి మండిపడ్డారు.
నీటి కేటాయింపుల కోసం చర్చలు..
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల కేటాయింపును వేగవంతం చేశామని, సమ్మక్క, సారక్క ప్రాజెక్ట్ కోసం 44 టీఎంసీల నీటి కేటాయింపు కోసం చర్చలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. సమ్మక్క, సారక్క ప్రాజెక్ట్‌పై ఛత్తీస్‌గఢ్‌తో ఎన్‌వోసీ కోసం కార్యదర్శి తో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదాతో.. రాయలసీమ లిఫ్ట్‌కు టెండర్లు..
అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయడం ద్వారా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (ఆర్‌ఎల్‌ఐఎస్) కోసం టెండర్లను పిలవడానికి అనుమతించిందని మంత్రి ఆరోపించారు. కేసీఆర్.. అప్పటి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిల మధ్య రహస్య ఒప్పందం కుదిరిన కొన్ని రోజు ల తరువాతే ఆర్‌ఎల్‌ఐఎస్ ప్రాజెక్టుకు ఆమో దం లభించిందని మంత్రి తెలిపారు. తెలంగాణలో సహజంగా ప్రవహించే 7 టీఎంసీల కృష్ణా నీటిని కోల్పోయింది. కానీ ఆంధ్రప్రదేశ్‌కు శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని తీసుకునేందుకు అనుమతి లభించింది అని మంత్రి ఉత్తమ్ వివరించారు.
రోజుకు 8 టీఎంసీలు..
జీవో నెం. 203తో రోజుకు 8 టీఎంసీల నీటిని ఉపసంహరించుకునేందుకు అనుమతించిందన్నారు. కేఆర్‌ఎంబీ డేటా ప్రకారం 2014-15 నుంచి 202-21 వరకు ఆంధ్రప్రదేశ్ కృష్ణానదీ జలాల్లో 64 శాతం ఉపయోగించుకుందని.. అయితే తెలంగాణ మాత్రం తన వాటా 36 శాతం కంటే తక్కువగా ఉందని గణాంకాలను వివరించారు. 2014-15లో ఏపీ 529.33 టీఎంసీలు ఉపయోగించుకోగా..
తెలంగాణ కేవలం 227.74 టీఎంసీలు (30.08 శాతం) మాత్రమే ఉపయోగించుకుందని, అలాగే 2020-21 నాటికి ఏపీ వినియోగం 629.07 టీఎంసీలకు పెరగ్గా.. తెలంగాణకు కేవలం 248.23 టీఎంసీలు లభించాయని తేల్చి చెప్పారు. ఈ స్పష్టమైన ఉల్లంఘనలపై అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని మంత్రి ప్రశ్నించారు.
2014 నుంచి శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించే సామర్థ్యాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2005లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44000 క్యూసెక్కులు ఉండగా.. 2023 నాటికి 92,600 క్యూసెక్కులకు పెంచుకుంది. తెలంగాణ అభ్యంతరం తెలిపినా.. ఆర్‌ఎల్‌ఐఎస్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళిందని మంత్రి అన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ఇతర అనుబంధ పథకాలు ఏపీకి మరింత నీటి మళ్ళింపు సామర్థ్యాన్ని కల్పించాయని, అయితే తెలంగాణకు చెందిన కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు స్కీములు నీటి కొరతతో పోరాడుతున్నాయని పేర్కొన్నారు. ఈ బహిరంగా ఉల్లంఘనపై అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టును లేదా.. కేడబ్ల్యూడీటీ ఎందుకు ఆశ్రయించలేదని మంత్రి నిలదీశారు.
తెలంగాణ హక్కులపై నేరుగా దాడి..
2023 నవంబరు 29న తెలంగాణ ఎన్నికలకు ఒకరోజు ముందు.. ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం 400 మంది సాయుధ పోలీసులతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి సగాన్ని బలవంతంగా ఆక్రమించిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం కీలక నియంత్రణ స్థానాలను స్వాధీనం చేసుకుని, కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండానే 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని మంత్రి అన్నారు. ఇది తెలంగాణ హక్కులపై నేరుగా దాడి చేయడమే. అయినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యిందని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపున పర్యవేక్షించేందుకు నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాముల వద్ద 35 ప్రదేశాల్లో టెలిమెట్రీ పరికరాలను అమర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా.. తెలంగాణ సొంత ఖర్చులతో వీటిని ఏర్పాటు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. దీనితోపాటు అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు ఆర్థిక పరిపాలనా వైఫల్యాలనుకూడా మంత్రి ఎత్తిచూపారు.
అధిక వడ్డీతో స్వల్పకాలిక రుణాలను తీసుకోవడంతో తెలంగాణపై అప్పుల భారం పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీ రేట్లను తగ్గించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. కొన్ని చోట్ల 10 శాతం నుంచి 7 శాతానికి వడ్డీరేట్లను తగ్గించగలిగామని వివరించారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్బీసీ) టన్నెల్ పనులు 100 శాతం పూర్తవుతాయని, అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టు పైభాగాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన నష్టాన్ని సరిచేయడానికి తమ కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిషలు పనిచేస్తుందన్నారు. తెలంగాణకు న్యాయం దక్కాల్సిన నీటి వాటాను రక్షించడంలో తమ ప్రభుత్వం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు.
మంత్రితో కేఆర్‌ఎంబీ ఛైర్మన్ భేటీ..
ఇదిలా ఉండగా.. గురువారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కేఆర్‌ఎంబీ ఛైర్మన్ అతుల్‌జైన్ జలసౌధలో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారు చర్చించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాలను సమానంగా పంచేలా కేఆర్‌ఎంబీ క్రియాశీలకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మంత్రి డిమాండ్ చేశారు. కృష్ణా నది జలాలను తెలంగాణలో రబీ సీజన్‌లో సాగు భూములకు అందించేలా చూడాలనికూడా ఉత్తమ్ ఈ సందర్భంగా కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ను కోరారు.
న్యాయమైన వాటాను కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోల్పోయింది
తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపుతో అన్యాయమైన కృష్ణా నదీ జలాల కేటాయింపును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని మంత్రి అన్నారు. క్యాచ్‌మెంట్ ప్రాంతం, కరువు ప్రభావిత ప్రాంతాలు, జనాభా, సాగుభూమి వంటి అంశాల ఆధారంగా జలాల కేటాయింపు జరుగుతుందని..
అయితే తెలంగాణ తన న్యాయమైన వాటాను ‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోల్పోయిందని’ మంత్రి పేర్కొన్నారు. ఈసందర్భంగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశాల మినిట్స్‌ను మంత్రి ఉటంకిస్తూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి కీలక ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించిన విధానాన్ని బయటపెట్టారు.
తప్పుడు డిజైన్.. నాసిరకం నిర్మాణం..
రూ. లక్ష కోట్లకుపైగా అప్పుచేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుడు డిజైన్ అని, అది నాసిరకం నిర్మాణం, సరిగ్గా నిర్వహణ లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తేయని మంత్రి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం హృదయంగా పేర్కొన్న మేడిగడ్డ బారాజ్ వారి సొంత పాలనలోనే కూలిపోయిందని.. ఆ వైఫల్యాన్ని ఒప్పుకోకుండా.. కేసీఆర్, హరీష్‌రావు, ఇతర బీఆర్‌ఎస్ నేతలు ఒకే ఒక స్తంభం కూలిపోయిందని నిర్లజ్జగా చెబుతుండటం హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
పాలమూరు ప్రాజెక్టుపై రూ. 27000 కోట్లు, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్ట్‌పై రూ. 9000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ.. ఒక్క ఎకరం భూమికి నీరు ఇవ్వలేదని అన్నారు. దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, దిండి వంటి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చెయ్యకపోయారో బీఆర్‌ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలంగాణ జల హక్కులను కాపాడటంతోపాటు నీటి పారుదల రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఉద్ఘాటించారు.