- ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి పనులు
క్షేత్రస్థాయిలో పనులు గుర్తిస్తున్న అధికారులు
మెదక్, జనవరి 29 (విజయక్రాంతి) ః జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందు బాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించు కోవడంతో పాటు వాటిని సంరక్షించుకుంటే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి నుంచి గట్టెక్కవచ్చని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి ఉపాధి హామీలో జల సంరక్షణ పనులు విరివిగా చేపట్టాలని సూచించింది.
ఈ సందర్భంగా రాష్ర్ట ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో 2025-26లో ఉపాధి హామీలో చేపట్టే జల సంరక్షణ పనులను క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు డీఆర్‌డీఏ అధికారులు ము మ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు పనులు గుర్తింపు చేసి వాటిని ప్రారంభించడానికి అనువుగా గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
జిల్లాలో 1.64 లక్షల జాబ్ కార్డులు..
జిల్లాలో 1.64 లక్షల జాబ్ కార్డుల ద్వారా 2,19,225 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన పనులను ఆ ఏడాదిలోపు పూర్తి చేయాలని, మరుసటి ఏడాది ఉపాధి హామీ కింద వాటిని చేపట్టరాదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిబంధన విధించింది. దీని ప్రకా రం పనులు చేపట్టి ప్రారంభించాల్సి ఉండడంతో గ్రామ సభలో తీర్మాణాలతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టడానికి గ్రామీణాభివృద్ధి సిబ్బంది ప్రణాళికలు తయా రు చేస్తున్నారు.
జల సంరక్షణలో భాగంగా చేపట్టే పనులు..
ఉపాధి హామీ ద్వారా జల సంరక్షణలో భాగంగా చేపట్టే పనుల్లో ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల్లో నీటి నిల్వల గుంతల నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. సింగిల్ ఫేజ్ మోటార్లు, చేతి పంపుల వద్ద, ఇండ్లలో వ్యక్తిగత ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపడతారు. ఇంటిపై భాగం లో కురిసిన వర్షపు నీటిని భూమిలోకి వెళ్ళేలా (రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్టక్చర్) నిర్మా ణాలు, ఖాళీ స్థలాలు, పంట పొలాల చుట్టూ కంధకాల ఏర్పాటు, అనువైన చోట చిన్నపాటి కుంటల నిర్మాణాలు చేపట్టనున్నారు.
నీటి ఎద్దడి నివారణ కోసమే..
వచ్చే సంవత్సరంలో జల సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తాం. ఈ ఏడాదిలో ఇప్పటికే నీటి నిల్వ గుంతల నిర్మాణాలు చేపట్టాం. కేంద మార్గదర్శకాల ప్రకారం నీటి ఎద్దడి నివారణ కోసమే జలసంరక్షణ పనులు చేపడుతున్నాం.
శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ, మెదక్