12-03-2025 01:09:44 AM
సూర్యాపేట/రంగారెడ్డి/జనగామ/కామారెడ్డి, మార్చి 11 (విజయక్రాంతి): భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. పచ్చగా ఎదిగిన వరి పైరు, పొట్టకొచ్చి కళ్లముందే ఎండి పోతుంటే రైతన్న గుండె చెరువవుతున్నది. కరువు ఛాయలు కంటతడి పెట్టిస్తున్నా యి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసంగిలో సాగవుతున్న పంటలకు సాగునీరు అంద డం లేదు.
పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం ఖరీదు అయినా.. కనీసం పంట పెట్టుబడులైనా రాబట్టుకుందామని ట్యాంకర్లతో పంటకు నీరు పెడు తున్నారు. మరికొందరు చేసేదేం లేక పంటను పశువుల మేతకు వదిలేస్తున్నారు.
ఏటా ఇదే నెలలో ఉండే సగటు భూగర్భజలాలు ఈసారి మరింత పడిపోతున్నాయి. ఎగువ నుంచి జలాలు రాకపోవడంతో రాష్ట్రంలో ప్రధాన సాగునీటి వనరులైన ఎస్‌ఆర్‌ఎస్పీ, ఎన్నెస్పీ కాలువలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వీటిపై ఆధారపడిన చెరువులు సైతం ఇంకిపోయాయి.
ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి పంటలకు జలాలు అందించేలా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా జన గామ జిల్లా వడ్లకొండ గ్రామానికి చెందిన రైతులు రోడ్డెక్కి సాగునీటి కోసం రాస్తారోకో చేపట్టారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో ఏడాది మొత్తం సమృ ద్ధి భూగర్భజలాలు ఉంటాయని రైతులు యాసంగిలో పంటలు సాగు చేశారు.వాతావరణ పరిస్థితులకు పది రోజుల నుంచి భూగర్భజలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన రైతులు ట్యాంకర్లతో పంటకు నీరందిస్తున్నారు.
అర్ధరాత్రి పొలానికి చేరుకుని తెల్లవారుజాము వరకూ కుటుమంతా పొలంలోనే ఉండి పంటకు నీరు పెడుతున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువు ఆయకట్టు పరిధిలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, అడ్లూర్, రంగంపేట్, ఇస్రోజివాడి, పోసానిపేట్‌లో పండిస్తున్న పంటలు ఎండిపోయాయి.
పంట కాల్వల మరమ్మతులు చేపట్టకపోవడంతో పంటలకు సాగునీరు అందడం లేదని పోసానిపేట రైతులు వాపోతున్నారు. సదాశివనగర్ మండలం బొంపల్లి, ఉత్తనూర్, బీర్కూర్, నస్రూల్లాబాద్ తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి.
సూర్యాపేట జిల్లాలో..
యాసంగిలో సూర్యాపేట జిల్లావ్యాప్తంగా రైతులు 4.76 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వీటిలో 1.80 లక్షల ఎకరాలు పైగా బోరు బావుల కింద సాగవుతున్నాయి. మరో 2.92 లక్షల ఎకరాలు ఎస్సార్‌ఎస్పీ, మూసీ, ఎన్నెస్పీ ఆధారంగా సాగవుతున్నాయి. ఎస్సార్‌ఎస్పీ ఆయకట్టు పరిధిలో 1,08,490 లక్షల ఎకరాలు, ఎన్నెస్పీ 1,73,931 లక్షల ఎకరాలు, మూసీ ప్రాజెక్ట్ కింద 10,664 ఎకరాలు పండుతున్నాయి.
బోర్లు, బావుల కింద 1,80,659 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. ప్రస్తుతం ఎస్సార్‌ఎస్పీ నుంచి సాగు నీరందక 8,160 ఎకరాల్లో పంట ఎండింది. పరిస్థితి మరో 15 రోజలు ఇలాగే కొనసాగితే పంట పూర్తిగా చేతికి రాకుండాపోయే పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం జిల్లా సగటు భూగర్భజలాలు 8.29 మీటర్లలో అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.
కానీ.. హుజూర్ నగర్ ప్రాంతంలో 20.46 మీటర్లు, నూతనకల్ ప్రాంతంలో 15.93 మీటర్లు, జాజిరెడ్డి గుడెం, చిలుకూరు మండలాల్లో 12 మీటర్లు, సూర్యాపేటలో 11.81 మీటర్ల మేరకు భూగర్భజలాలు పడిపోయాయి.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండుతున్నాయి. కొందరు రైతులు పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. మరికొందరు ఇప్పటికే పశువుల మేతకు వదిలేశారు. జిల్లాలో యాసంగి సీజన్‌లో 50 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు.
ప్రస్తుతం ఆమనగల్లు, మాడ్గుల, మంచాల, కడ్తాల్, తలకొండపల్లి, మహేశ్వరం, కందుకూరు, చేవెళ్ల, షాబాద్, కేశంపేట, కొందర్గు కొత్తూరు మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోయాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో పంట నష్ట తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నది.
జిల్లాలో ఫిబ్రవరిలోనే భూగర్భ జలాలు 11.22 మీటర్లకు పడిపోయాయి. ఇక మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జనగామ జిల్లాలో..
జనగామ జిల్లా పరిధిలోని బచ్చన్నపేట, జనగామ మండలాల్లో కరువు పరిస్థితులు దాపురించాయి. యాసంగి ప్రారంభమైన నాటి నుంచి ఆయా మండలాలకు సాగునీరు అందడం లేదు. భూగర్భజలాలు అడుగంటడంతోనే ఈ పరిస్థితి. సీజన్‌లో 1.67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు అయింది. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో దానిలో సగమైనా చేతికొచ్చే పరిస్థితి లేదు.
జనగామ మండలానికి ప్రధాన నీటి వనరైన బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాల్సి ఉండగా, వాటిని తపాస్‌పల్లికి తరలించి అక్కడి నుంచి ఆలేరు ప్రాంతంలోని పంటలకు నీటిపారుదలశాఖ అందిస్తున్నది. దీంతో జనగామ నియోజకవర్గ పరిధిలోని పంటలు ఎండుతున్నాయి.
జనగామ మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన రైతులు సాగునీటి కోసం ఇటీవల ధర్నా చేపట్టారు. గ్రామ చెరువును గోదావరి జలాలతో నింపాలని డిమాండ్ చేశారు. దేవరుప్పుల మండలానికి చెందిన కొందరు రైతులు ఇప్పటికే పంటను పశువుల మేతకు వదిలేశారు. గత నెలలో జిల్లాలో భూగర్భజలాలు సగటున 8.82 మీటర్లు ఉండగా, వారం వ్యవధిలోనే 4 మీటర్లకు పడిపోయాయి. ఈ పరిస్థితిని తలచుకుని రైతులు దిగాలు చెందుతున్నారు.
మొత్తం పెట్టుబడి పోయినట్లే..
నాకు ఎస్సార్‌ఎస్పీ జోన్- 2 ప్రధాన కాలువకు అనుకుని ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పడంతో సన్నాలే సాగు చేశా. ఆన్ ఆఫ్ పద్ధతిలో జలాలు అందుతాయని పత్రికల్లో వచ్చిన ప్రకటన చూసి సాగు ప్రారంభించా. రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మొత్తానికి మొత్తం పోయింది. గోదావరికి ఎగువ నుంచి జలాలు రాకపోవడంతో ఎస్సార్‌ఎస్పీ జలాలు సైతం ఆగిపోయాయి. దీంతో నేను సాగు చేస్తున్న ఏడెకరాల పంట ఎండింది.
నల్లపు పరమేశ్, రైతు,
పెన్‌పహాడ్, సూర్యాపేట జిల్లా
పంట పొట్టదశలో ఎండింది..
నేను నాకున్న ఐదెకరాల్లో మూడు ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశా. ఎండల ధాటికి భూగర్భజలాలు అడుగంటాయి. బోర్లు కూడా వట్టిపోయాయి. ఫలితంగా పంట ఎండిపోయింది. పొట్ట దశకు వచ్చిన పంట చేతికి రాకుండా పోయింది. బోర్ల నుంచి నీరు రాకపోవడంతో పంట ఎండిపోతుంది. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి.
పోతుల చంద్రయ్య, రైతు, పోసానిపేట్, కామారెడ్డి జిల్లా