calender_icon.png 28 December, 2024 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినులపై వాచ్‌మెన్ దాడి

02-12-2024 12:24:08 AM

క్యారెట్ తిన్నారనే ఆగ్రహంతో..  

కొత్తగూడెంలోని ఎస్సీ హాస్టల్‌లో ఘటన

ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థినులు

వేధింపుల వెనుక అధికారిణి హస్తం?

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 1 (విజయక్రాంతి): వసతి గృహాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట వసతి గృహాల విద్యార్థిలు పలు రకాల వేధింపులకు గురవుతున్నారు. తాజాగా శనివారం రాత్రి  కొత్తగూడెంలోని ఎస్సీ హాస్టల్‌లో దారుణం చోటు చేసుకొంది. విద్యార్థినులను కంటికి రెప్పలా కాడాల్సిన వాచ్‌మన్ పిల్లలు క్యారెట్ తిన్నారనే ఆగ్రహంతో చెంపలు వాయించడమే కాకుండా, కర్రలతో దాడికి పాల్పడినట్టు తెలుస్తున్నది.

ఎస్సీ పోస్ట్‌మెట్రిక్ హాస్టల్‌లో కొందరు విద్యార్థినులు క్యారెట్ తిన్నారు. దీంతో ముగ్గురు విద్యార్థినులపై వాచ్‌మెన్ చెయ్యి చేసుకోవడంతో పాటు, కర్రలతో దాడికి పాల్పడినట్లు విద్యార్థినులు ఆరోపించారు. మూడు నెలల క్రితం అదే హాస్టల్‌లో భోజనం సరిగా లేదని పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. అప్పటి నుంచి అధికారుల వేధింపులు మరింత పెరిగాయని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.

కొందరు అధికారులు విద్యార్థినులను టార్గెట్ చేసుకుని వారిపై చిన్న చిన్న కారణాలతో వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిస్తున్నట్టు తెలుస్తున్నది. దీని వెనుక ఓ అధికారిణి హస్తం ఉన్నదని, ఆమె చెప్పినట్టుగానే సిబ్బందితో దాడులకు, వేధింపులకు పాల్పడుతున్నదని సమాచారం. చదువుకోసం హాస్టల్‌కు పంపితే పిల్లల్ని దాడులు చేయడమేమిటని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హాస్టల్‌లా లేక జైలా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వార్టెన్ ఎమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వార్డెన్‌తోపాటు దాడికి పాల్పడిన వాచ్‌మన్‌పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు శనివారం రాత్రి 10.30 గంటల వరకు హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.