calender_icon.png 25 November, 2024 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా నేరమే

24-09-2024 03:12:28 AM

స్టోర్ చేసుకున్నా తప్పే

ఈ అంశం పోక్సో చట్టం పరిధిలోకి వస్తుంది

సుప్రీం కోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం, స్టోరేజీలో పెట్టుకోవడం పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కపెడుతున్నట్లు తేల్చిచెప్పింది.

అలాంటి తీర్పు ఓ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవ్వడాన్ని ఘోర తప్పిదంగా భావిస్తున్నామని పేర్కొన్నది. అలాగే కేంద్ర ప్రభు త్వానికీ పలు సూచనలు చేసింది. పోక్సో చట్టంలో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ అనే పదాన్ని ‘చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసిస్ మెటీరియల్’తో భర్తీ చేయాలని ఆదేశించింది. ఆ సవరణలు అమలులోకి వచ్చే వరకు దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని సూచించింది. 

ఆ పదాన్ని వాడొద్దు

ఇకపై కోర్టులు చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించొద్దని ఆదేశించింది. చైల్డ్‌పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ జనవరి 11న మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ హైకోర్టు అభిప్రాయపడింది. 28 ఏళ్ల నిందితుడు వీడియోలు చూశాడే తప్ప, తాను ఎవరికీ పంపించలేదని పేర్కొన్నది. దీనిపై కొన్ని ఎన్జీవోలు, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై స్పందిస్తూ.. చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం నేరమని తేల్చిచెప్పడంతో తిరిగి సదరు యువకుడిపై క్రిమినల్ చట్టాలు వర్తించనున్నాయి.