26-02-2025 12:08:31 AM
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారానే మంచి పర్యావరణం, ఆరోగ్యం, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. నవభారత్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి పాఠశాల అసెంబ్లీ లో పాల్గొని విద్యార్థులతో పాటుగా ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో అసంబ్లీ చేయు విధానాన్ని కొనియాడారు. వేస్ట్ మేనేజ్మెంట్ అనేది పర్యావరణం, ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని అన్నారు. వ్యర్ధాలను సరైన పద్ధతిలో నిర్వహించకపోతే ఆరోగ్యం, పర్యావరణం పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన విద్యార్థులకు తెలిపారు.
వ్యర్ధాలను సేకరించడం, శుద్ధి చేయడం, పారవేయడం వంటి క్రమబద్ధమైన ప్రక్రియను వేస్ట్ మేనేజ్మెంట్ అంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత, పాఠశాల ప్రిన్సిపల్ మైధిలి, పాఠశాల, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.