calender_icon.png 19 January, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసీరా కొత్త కవితాధార

13-01-2025 12:00:00 AM

‘రవి గాంచని చోటును కవి గాంచును’ అన్న మాటను నిజం చేస్తూ, సీనియర్ కవి వసీరా కవితా విశ్వరూపం చూపారు. ‘ఏనుగమ్మ ఏనుగు..’ పేరున ఆయ న ఇటీవల విడుదల చేసిన కవితా సంపుటిలో అద్భుత రీతిలో వచన కవిత్వాన్ని పండించారు. ‘కాదేదీ కవిత్వానికి అనర్హం’ అన్న దానిని సార్థకం చేస్తూ అనేక సరికొత్త అంశాలపై తనదైన శైలిలో కవితా ప్రయోగాలు చేశారు.

నల్గొండ, అజు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన ఈ పుస్తకం ఎవరికైనా చూడగానే తెరవాలనిపిస్తుంది. సీనియర్ జర్నలిస్ట్, రచయిత, చిత్రకారుడు అయిన తల్లావఝుల శివాజీ కవర్‌పేజీకి వేసిన సృజనాత్మక చిత్రం ‘సూక్ష్మంలో మోక్షం’ వలె అత్యంత ఆకర్షణీయంగా ఉంది. కవర్ బొమ్మలోని రంగుల కలయిక, కాగితం, ప్రింటింగ్ అన్నీ ముడితే మాసిపోయేలా కుదిరాయి. ‘ఏనుగమ్మ ఏనుగు..’ అన్న సరళమైన టైటిల్ పిల్లలుసహా పెద్దలనూ తనవైపుకు తిప్పుకుంటుంది.

మొత్తం 78 కవితలు, ప్రతీ కవితకు తగ్గట్టుగా శివాజీ వేసిన లైన్ డ్రాయింగ్స్ సామాన్యుల నుంచి మేధావుల వరకూ అందరినీ ఆలోచింపచేయనడంలో సందేహం లేదు. 1961లో ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో జన్మించిన వసీరా పూర్తి పేరు వక్కలంక సీతారామారావు. సుమారు నాలుగు దశాబ్దాలుగా వచన కవితా వ్యవసాయం చేస్తున్నారు. 1989లో మొదటి కవితా సంపుటి ‘లోహనది’ తెలుగు సాహిత్యంలో ఆయనకు ఒక విలక్షణమైన, తనదైన స్థానాన్ని కల్పించింది.

‘లోహనది’కి ఫ్రీవర్స్ ఫ్రంట్, గరికపాటి అవార్డులు వచ్చాయి. ఆనాటి వసీరాకు ఈనాటి ‘ఏనుగమ్మ ఏనుగు..’లో అనేక కవితలతో అనూహ్య భావుకతను ప్రదర్శించిన వసీరాకు మౌలిక వ్యత్యాసం తప్పక కనిపిస్తుంది. ఆనాటి యువకవి ఇవాళ అరవై పైబడిన వారు. ఇన్నేళ్ల జీవనచక్రం ఆయనకు అనేక సత్యాలను బోధించి వుంటుంది. ఆ ఫలితమే ఈ కవితలు కావచ్చు. “ఎక్కడుంటాడు ఆ వసీరా?

ఈ వసీరానే మన వసారాల్లో ఎందుకు నిలబడాలి, నీకో నాకో విధేయంగానో, అవిధేయంగానో?” అన్న సందేహం ముందుమాటగా పుస్తకం వెనుక పేజీల్లో దాదాపు అన్ని కవితలనూ ‘కట్టే కొట్టే తెచ్చే’ అన్నంత సూక్ష్మంగా పరిచయం చేసిన ప్రముఖ కవి సీతారాం (కవిత్వ మూలకణం నుంచే సృష్టీ దృష్టీ దర్శనం, పే: 208) అభిప్రాయంలోనూ వ్యక్తమైంది.

1995 నుంచీ 2024 వరకూ ఆయా సందర్భాలలో రాసిన ఇందులోని కవితలు శీర్షికల పేర్లనుబట్టి ఏ రకమైన వస్తువులను కలిగివున్నాయో ఒకింత అర్థం చేసుకో వచ్చు. కవితా వస్తువు తెలిసినంత మాత్రాన అందులోని శైలి, విన్యాస ప్రయోగాలు, అంతిమ సూత్రీకరణలు, సందేశాలు మనకు బోధపడవు. కనుక, ప్రతీ కవిత మొత్తంగా చదవాల్సిందే. ప్రతి మనిషినీ కాలం తనదైన పద్ధతిలో మార్చేస్తుంది.

నేను మారను అనుకొనే వారు కూడా మారక తప్పని పరిస్థితులను అదే సృష్టిస్తుంది. మారడం మన తప్పు కానే కాదు. ఏం జరిగినా మారకుండా మొండికేయడం తప్పు. ఈ పద్ధతిలో వసీరా కవిత్వంలో, ఎంపిక చేసుకున్న వస్తువుల్లో, చెప్పిన విధానాల్లో, ఇచ్చిన తీర్పుల్లో కనిపిస్తున్న మార్పులను అందరం నచ్చినా, నచ్చకున్నా అంగీకరించ వలసిందే. ‘మృత్తికాస్నానం’,

‘వృక్షం శరణం గచ్ఛామి’,‘ నీ కలని సాగు చెయ్యడానికి’, ‘సర్వాంతరంగం’, ‘సూర్యబాలుడు’, ‘కప్ప నెత్తిమీద’, ‘చందమామ గూటికి’, ‘ఏకానేకం’, ‘పెరుగ్గిన్నెలో సూరీడు’, ‘సంధ్యాదేహం’, ‘సూర్యస్పర్శ’, ‘గురుచరణం మమశరణం’, ‘వాక్యాల మధ్య ఆకాశం’, ‘సూర్యుని స్వప్నంగా’, ‘మాతృస్పర్శ’, ‘ప్రేమచెట్టు’, ‘తీయని ఋతువు’, ‘మృత్యు భస్మంలోంచి’.. ఇలా ఆయా కవితల శీర్షికలనుబట్టి వాటి ఇతివృత్తం మనకు బోధపడుతుంది. మొత్తంగా ఒక సగటు మనిషి జీవన అనుభవాలను కవిత్వీకరించి, ఆ మొత్తం కవిత్వ వస్తువులను అంబారీ ఏనుగును ఎక్కించినంత పనిచేశారు వసీరా.

ప్రతీ కవితలోని ప్రతీ వాక్యం ఒక రకమైన కవితాత్మకమే. సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, భక్తి విశ్వాసాల భేదాభిప్రాయాలు అన్నింటినీ పక్కనపెట్టి కేవలం ‘కవితాస్వాదన’ కోసమే అన్న ట్టుగా చదువుతూపోతే, అనేకమైన అద్భుత ప్రయోగాలు మనలను ఆశ్చర్యపరుస్తాయి. ఎక్కడా అతిశయోక్తులు, వ్యర్థ ప్రయోగాలు కనిపించవు. ప్రతీ సందర్భంలోనూ కవి వ్యక్తీకరించిన చాలా లోతై న, గాఢమైన వ్యక్తీకరణకు ముగ్ధు లం కావాల్సిదే.

ఈ కవి నిజంగానే రవి గాంచని అం శాలను సైతం అన్వేషించి పట్టుకొన్నారనిపి స్తుంది. ఎంతో బరువైన కవితలన్నింటిలోకెల్లా విభిన్నంగా, చాలావరకు తేలిగ్గా అనిపించే (టైటిల్) కవిత ‘ఏనుగమ్మ ఏనుగు..’! కవి తాత, తన మనవడితో ఏనుగెక్కి ఊహల లోకాల్లోకి మాయమైపోయి, తిరిగి వచ్చిన వైనాన్ని గొప్పగా చెప్పారు. ‘తేనెరశ్మి కురిసే లోయల్లోకి’, ‘సూరీడు ఆరేసిన బంగారు రంగు/ ఉల్లిపొర వస్త్రాల కెరటాల్లోకి’ అంటారు. ఇవేకాదు, ఇంకా అనేక ప్రయోగాలు.

‘అప్పు డెప్పుడో ఒకరోజు గులాబీని ముద్దెట్టుకోబోయాను/ నా పెదాలకి ఉప్పగా నెత్తుటి వాసన’, ‘తడిలేని ఏడుపు.. మనసు లేని నవ్వు/ జీవితమైపోయాయి, నాకింకేం గుర్తు లేదు’ (పే: 8-, 9), ‘ఎవరో కొట్టేశారు నా హృదయాన్ని/ వేలయేళ్లుగా పూర్వీకులు ఇచ్చిన సంస్కృతిని, నా ఆత్మని’, ‘నా కన్నీటితో రక్తంతో తడిసిన ఆ నేలలో నన్ను పాతుకోవాలి’ (పే: 12), ‘ఇక్కడ ఆకాశానికి వెన్నెముక తీసేశారు’.

‘పిగిలిపోయి పీలికలు పీలికలుగా తీగలకు వేలాడుతుంది’, ‘పొగగొట్టాల మానుతొర్రల్లో పుర్రెలు’, ‘భూమ్యాకాశాల నిండా నల్లచర్మం కాలుతున్న వాసన’, ‘భారీ మృత్యు ఉత్పత్తి’ (పే: 14, 15. 17), ‘నా మనసుని కాస్తంత కన్నీటితో తడిపి అక్కడో కలని నాటుతావు’ (పే: 40), ‘రాజ్యం భద్రంగా ఉండి చప్పట్లు కొడుతుంది’ (పే: 46), ‘చెమటచుక్కలో మొలిచిన ఓ చెట్టు’, ‘ప్రతి చెట్టూ ఓ మనిషే’ (పే: 50, 51), ‘ఒక్కో ఆకూ ఒక్కో జెండాలా రెపరెపలాడుతుంది’ (పే: 56), ‘మృత్తికా స్నానం చేసిన చినుకు’, ‘మట్టిలోంచి నిద్రలేచి మనిషై బతుకుతుంది’ (పే: 58, 59), ‘చిన్నపాప నిద్ర పోతోంది మంచు నిద్ర పోయినట్లు’ (పే: 66), ‘సరిగ్గా బుద్ధుని చుట్టూ ఉన్నట్లే/ చెట్టుచుట్టూ కాంతి వలయాలు’, ‘దోసిలి నిండా జ్ఞానం’, ‘మనిషికి మొదటి గోచీని ఇచ్చింది చెట్టే’ (పే: 70, 71), ‘గోదావరి వెలిగిస్తుంది ఇసుక తిన్నెల్ని’, ‘అసలు వెన్నెల కానిది ఏదీ లేదే’ (పే: 83, 84), ‘అద్దంలో దూకి ఈత కొట్టాలని’ (పే: 116), ‘పెరుగ్గిన్నెలో సూర్యుడు కాలాన్ని చిలుకుతాడు’ (పే: 129), ‘లేత అరిటాకు కింద నిద్దరోయే ఆకుపచ్చని ఎండ’ (పే: 189).. ఇలా సాహిత్యాభిమానుల హృదయాలను స్పందింపజేసే ప్రయోగాలు ఎన్నెన్నో. మొత్తంగా ఈ కవితల్లో పాఠకులు ఒక కొత్త వసీరాను చూస్తారు.

(ఏనుగమ్మ ఏనుగు.., వసీరా కవిత్వం, పేజీలు: 226, వెల: రూ. 200/ ప్రతులకు: 9912460268 (అజు పబ్లికేషన్స్).