calender_icon.png 13 November, 2024 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టిని కడిగి ఇసుకను తీసి!

11-11-2024 12:37:15 AM

  1. ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల ఏర్పాటుకు సరఫరా
  2. పాలమూరులో జోరుగా దందా 

మహబూబ్‌నగర్, నవంబర్ 10 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా అక్రమార్కులు మట్టిగుట్టలను తవ్వి ఫిల్లర్ ఇసుక దందా చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఆ ఇసుకనే తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

మహబూబ్‌నగర్ రూరల్, నవాబ్‌పేట మండలం, కోయిల్‌కోండ, మ హబూబ్‌నగర్ రూరల్ మండలం, భూ త్పూర్, రాజాపూర్, గంగాపూర్, మిడ్జిల్‌తోపాటు పలు ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఈ దందా ఎక్కువగా నడుస్తున్నట్టు తెలుస్తున్నది. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే అ క్రమార్కులు రెచ్చిపోతున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఇసుక మాఫియా పలు ప్రాంతాల్లో ఇసుకను డంప్ చేసి దందా చేస్తున్నట్టు సమాచారం. 

నిర్మాణాల్లో ఫిల్టర్ ఇసుక 

ఇండ్ల నిర్మాణాలతోపాటు ప్రభుత్వం అక్కడక్కడ వేస్తున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు ఫిల్టర్ ఇసుకను వాడుతున్నారు. ఫిల్టర్ ఇసుకను వినియోగించడంతో సీసీ రోడ్లు, ఇండ్ల గోడలకు నెర్రలు బారుతున్నాయి. నియంత్రిచాల్సిన అధికార యంత్రాంగం మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై రూరల్ మండల తహసీల్దార్‌ను వివరణ కోరగా అక్రమంగా ఇసుక, మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

తెలిసినా పట్టించుకుంటలేరు?

ప్రతి రోజు జిల్లా, గ్రామ, మండల స్థాయిలో ఎలాంటి పనులు జరుగుతున్నాయనే నివేదికలను అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తున్న విషయం విధితమే. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నా అధికార యంత్రాంగం ఎందుకు మౌనం ప్రదర్శిస్తున్నదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్‌నగర్ రూరల్ మండల పరిధిలోని తువ్వగడ్డ తండా వద్ద గుట్టలను జేసీబీలతో తవ్వేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. 

గుట్టలు తవ్వి మట్టితో ఇసుకు తయారీ..

సహజసిద్ధంగా ఏర్పడిన గుట్టలను అక్రమార్కులు నేల మట్టం మట్టిని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా మట్టిని కడిగి ఇసుకను తయారు చేసి విక్రయిస్తున్నారు. అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయాలుగా సాగుతున్నది. సహజ సంపదను కాపాడాల్సిన అధికారులు ఏమీపట్టనట్టు వ్యవహరిస్తుండటంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని గుట్టలు కనుమరుగయ్యే అవకాశం ఉందని జిల్లా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 

సత్తుపల్లి టూ ఆంధ్రా 

  1. అక్రమంగా తరలిపోతున్న మట్టి 
  2. చోద్యం చూస్తున్న అధికారులు 

ఖమ్మం, నవంబర్ 10 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతం నుంచి ఆంధ్రా ప్రాంతానికి పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తరలిపోతోంది. వందల లారీల్లో పెద్ద ఎత్తున మట్టిని తోలుకుపోతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. సత్తుపల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రాకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల గుత్తేదారులు మట్టిని తరలించుకుపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అరకొర అనుమతులు తీసుకుని, తెలంగాణ సర్కార్‌కు ఎటువంటి రుసుం చెల్లించకుండానే భారీగా మట్టిని తోల్కోనిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. వేంసూరు మండలంలోని ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరిపి ఆంధ్రా ప్రాంతంలోని చింతలపూడి మండలంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు తరలిస్తున్నట్టు తెలుస్తున్నది.

అస్సైన్‌మెంట్ పట్టాలు ఉన్న రైతుల భూముల్లో కూడా మట్టిని తవ్వుతున్నట్లు సమాచారం. ఆంధ్రా ప్రాంతానికి ఇక్కడి మట్టిని తరలించాలంటే అన్ని రకాల అనుమతులతోపాటు పన్నులు, డిపాజిట్లు తెలంగాణ ప్రభుత్వ మైనింగ్ శాఖకు చెల్లించాల్సి ఉంది.

ఇవేమీ లేకుండానే అరకొర అనుమతులతో లెక్కకు మించి లారీల్లో మట్టిని రాష్ట్రాన్ని దాటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక మైనింగ్, రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు.