సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అవకాశం ఇస్తే వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాలనుకుంటున్నట్లు వార్నర్ తన మనసులోని మాట బయటపెట్టాడు. గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన అనంతరం వన్డేలకు వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్ ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా నిష్క్రమణ అనంతరం పొట్టి ఫార్మాట్‌కూ రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్‌పై ఆసక్తికరంగా స్పందించాడు. ‘చాప్టర్ క్లోజ్ అయింది. ఆసీస్ తరఫున కొన్నేళ్ల పాటు సుదీర్ఘ కెరీర్ కొనసాగించా. అన్ని ఫార్మాట్లలోనూ వందకు పైగా మ్యాచ్‌లు ఆడడం గొప్ప గౌరవం. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులో చోటు కల్పిస్తే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి రెడీగా ఉన్నా’ అని చెప్పుకొచ్చాడు.