అసలే చలికాలం.. శరీరానికి నిండుగా ఉంటూనే వెచ్చదనాన్ని పంచే దుస్తుల్ని ఇష్టపడతారు మగువలు. స్వెట్టర్లు, శాలువాలు ఇదే కోవకు చెందుతాయి. అయితే ఏది ఎంచుకున్నా సౌకర్యానికి తోడు స్టులిష్‌గా కనిపించాలని ఆరాటపడతారు. వాళ్ల అభిరుచులకు తగ్గట్టుగానే విభిన్న డిజైన్లతో ఆకట్టుకుంటున్నాయి.
చలి నుంచి రక్షణ పొందటానికి నచ్చిన శాలువా ఎంచుకుంటే సరిపోదు.. దాన్ని స్టులిష్‌గా ధరించినప్పుడే ఫ్యాషనబుల్‌గా కనిపించవచ్చంటున్నారు డిజైనర్స్. సంప్రదాయంగా కనిపించే శాలువాలు మృదువుగా, సౌకర్యంగా హాయిగొలిపే లేత రంగుల్లో తయారవుతూ ఉంటాయి. నాణ్యమైన నూలుపోగులతో తయారుచేసిన శాలువాల గురించి తెలుసుకుందాం..
కాశ్మీర్ శాలువా!
కశ్మీర్ లోయలో తయారయ్యే.. రంగురంగుల శాలువాకు వందేళ్ల చరిత్ర ఉన్నది. దాన్ని ‘కానీ షాల్’ అని అంటారు.ఈ శాలువాను మొగల్ రాజులు, రాణులు.. ఎక్కువగా ఇష్టపడేవాళ్లు. సుతిమెత్తగా, అతి పలుచగా, ఎంతటి చలినైనా తట్టుకోవడంలో కాశ్మీర్ శాలువాలకు ఎదురులేదు. శాలువా తయారీకి లడఖ్ పాశ్మినా మేకల ఉన్నిని వాడతారు.
ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ ముచ్చటపడి తన ముద్దుల భార్య జోసెఫిన్‌కు ఇచ్చిన కానుక.. కాశ్మీర్ శాలువా. శాలువా అనగానే ఊదా, క్రీమ్ రంగుల్లో ఉన్నవే చాలామంది ఎంచుకుంటుంటారు. అందులోనూ ప్లెయిన్, చెక్స్.. వంటి ప్యాటర్న్స్ ఉన్నవి ధరించడానికి ఇష్టపడతారు. అయితే ఈ వింటర్‌లో కాస్త కొత్తగా ప్రయత్నించాలనుకునే వారు.. మ్యాచింగ్ రంగుల్లో.. లేదంటే కాంట్రాస్ట్ కలర్స్‌నీ ప్రయత్నించవచ్చు.
డోంగ్రియా శాలువా
ఒరిస్సా నియమిగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న డోంగ్రియా కోండ్ తెగకు చెందిన ఆదివాసీలు తయా రు చేసే ఈ శాలువలకు జీఐ ట్యాగ్ గుర్తింపు కూడా పొందింది. ఈ శాలువా సహజసిద్ధమైన నూలుతో.. చేతి అల్లికలతో రూపొందించబడుతుంది. శాలువా చిక్కగా.. లేత రంగులతో హుందాగా కనిపిస్తుంది.
ఇది మన సంస్కృతికి, సంప్రదాయాలకు సూచిక. డ్రస్ ప్లెయిన్‌గా ఉంటే ప్రింటెడ్ శాలువాను, ప్రింటెడ్ డ్రస్ అయితే ప్లెయిన్ శాలువాను జత చేస్తే లుక్ అదిరిపోతుంది.ఇలాంటి కాంబినేషన్ ఈవెనింగ్ పార్టీలకు బాగా సూటవుతుంది. రాత్రిపూట చలిగా అనిపించకుండా ఉండటంతో పాటు స్టులిష్‌గానూ కనిపించవచ్చు.
జరీ శాలువా
గుజరాత్, కచ్ ప్రాంతంలోని భుజోడి గ్రామంలో సంప్రదాయ భుజోడి హ్యాండ్‌లూమ్ చీరలకు మాత్ర మే కాదు శాలువాలకు కూడా ప్రత్యేకం. అత్యంత నాణ్యమైన నూలుతో కూడిన క్లిష్టమైన డిజైన్ల వల్ల భుజోడి శాలువాలు మహిళలతో పాటు ఫ్యాషన్ డిజైనర్లను సైతం ఆకట్టుకుంటున్నాయి. గుజరాత్‌లోని భుజ్ నగరానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న భుజోడి గ్రామంలోని కళాకా రుల మగ్గాలు వడికే శాలువాలు 500 ఏళ్ల నాటి చరిత్రకు ప్రతిబింబం.
రోజూ చీరలు ధరించడం కొంత మందికి అలవాటు. ఇలాంటి వారు శాలువాను భుజా ల చుట్టూ చుట్టేస్తే చీర హైలైట్ కాకపోగా.. కాస్త అసౌకర్యంగానూ అనిపిస్తుంది. అందుకే శాలువానూ ఒకే వైపు వేసుకోమంటున్నారు డిజైనర్స్ ప్రింటెడ్, కాంట్రాస్ట్ కలర్ శాలువాలు ఎంచుకుంటే రాయల్‌గా కనిపిస్తారు.
చేనేత శాలువా..
మగువలు మెచ్చే పట్టు చీరలకు నిలయం. దేశ సంస్కృతీ, సంప్రదాయాల ఔన్నత్యానికి ప్రతీక పోచంపల్లి చేనేత వస్త్రాలు. ఇక్కడి కళాకారులు నేసిన వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో తళుకులీనుతున్నాయి. పట్టు చీరలు మాత్రమే కాదు.. శాలువాలకు కూడా ప్రసిద్ధి. ఇక్కత్ శాలువాలు ఫ్యాషన్ ప్రియులు, డిజైనర్లను ఆకట్టుకుంటాయి. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే రంగులను తయారీలో వాడతారు. ఈ శాలువాలు చూడటానికి హుందాగా.. అందంగా కనిపిస్తాయి.