calender_icon.png 24 December, 2024 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదాములను పూర్తిస్థాయిలో వినియోగించాలి

24-12-2024 01:52:09 AM

కోల్డ్‌స్టోరేజీలు, గిడ్డంగులను ఆధునీకరించాలి..

పైకప్పులపై సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాలి.. 

చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయం

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): గిడ్డంగులశాఖ పరిధిలోని గోదాములను పూర్తిస్థాయిలో వినియోగించాలని, ఎక్కడా ఖాళీ ఉండకుండా చూసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. గోడౌన్లు మరమ్మతుల విషయంలో అలసత్వం వహించరాదని, గోడౌన్ల పైకప్పుపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం వ్యవసాయ, చేనేత అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని గిడ్డంగులు అందుబాటులోకి తేవాల్సి ఉందన్నారు.

కోల్డ్‌స్టోరేజీలు, గిడ్డంగులను ఆధునీకరించాలని సూచించారు. అలాగే మార్క్ ఫెడ్, మార్కెటింగ్ శాఖ పరిధిలోని గోదాములకు ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, తద్వారా రవాణా ఖర్చులు తగ్గి, ఆర్థిక భారమూ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. యాసంగిలో ఎరువుల సరఫరా నిర్వహణ సమర్థంగా ఉండాలన్నారు. లోటుపాట్లకు తావు లేకుండా తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను అందించేందుకు బ్యాంకర్లు, కంపెనీల  సహకారంతో  ప్రతి జిల్లాలో వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. టెస్కో ఉత్పత్తుల అమ్మకాలు పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. యారన్ డిపో ద్వారా 90 శాతం క్రెడిట్ పద్ధతిలో నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలన్నారు. విత్తన కార్పొరేషన్ ద్వారా రైతులకు సకాలంలో జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ  ఉదయ్‌కుమార్, ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్‌బాషా, మార్క్ ఫెడ్ అధికారులు, కోఆపరేటివ్ యూనియన్, అగ్రోస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

రైతుభరోసాపై బీఆర్‌ఎస్ బహిరంగ లేఖ హాస్యాస్పదం..

పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుసంక్షేమానికి బడ్జెట్‌లో 35 శాతం నిధులు కేటాయించిందని మంత్రి తు మ్మల నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.  అన్ని నిధులు ప్రకటించినందుకు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు ఉందని అభిప్రాయపడ్డారు. రైతుభరోసాపై బీఆర్‌ఎస్ నేతలు బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో  రైతు భరోసాపై జరిగిన చర్చలో బీఆర్‌ఎస్ సభ్యులను అభిప్రాయాలు తెలపాలని కోరామని, అది పెద్ద తప్పు అయినట్లు విమర్శలు చేయడం సరికాదన్నారు. బీ ఆర్‌ఎస్ పాలనలో రూ.21వేల కోట్ల ప్రజాధనం రైతుబంధు పథకంలో భాగంగా దుర్వినియోగమైందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఆ పథ కానికి కొన్ని మార్పులు చేసి, కేవలం సాగులో ఉన్న భూమికీ మాత్రమే రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయిస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించా రు.

గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలైన రాష్ట్రయ కృషి వికాస్, జాతీయ ఆహార భద్రత మిషన్‌తో మరెన్నో పథకాలను రాష్ట్రానికి రానీయలేదని గుర్తుచేశారు. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు రైతులకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై రాళ్లు విసరాలని చూడడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ కూడా చెల్లించలేదని, ప్రస్తుత ప్రభుత్వమే గతంలోని బకాయిలు చెల్లించిందని స్పష్టం చేశారు.

పంట నష్టపరిహారం కోసం నాడు రైతులు హైకోర్టు గడప ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వరి వేస్తే ఉరి అని, మొక్కజొన్న వద్దు అని, సన్నాలు సాగు చేయమని రైతులను తప్పుదారి పట్టించేందుకు యత్నించిందన్నారు. గతంలో ఆయిల్ పాం గెలల ధర తగ్గినప్పుడు, ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేదని వాపోయారు. తమ పాలనలో కేవలం ఏడాదిలో టన్ను ఆయిల్‌పాం గెల ధరను రూ.20 వేల వరకు తీసుకొచ్చామన్నారు.