01-03-2025 12:33:15 AM
ఇన్చార్జ్ వార్డెన్లతో లోపిస్తున్న జవాబుదారితనం
నాసిరకం సరుకులతో వంటకాలు
పట్టించుకోని అధికారులు
సూర్యాపేట, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధుల బాగోగులు చూడాల్సిన భాధ్యత ఉన్న సంక్షేమాధికారులు సరిపడ లేక పోవడం, ఉన్న వారికి ఇంన్చార్జ్ భాధ్యతలు ఇస్తే వారు చుట్టపుచూపుల వచ్చి వెలుతుండటంతో హాస్టల్ విద్యార్థులు ఎవ్వరు లేని వారు అవుతున్నారు. దీనికి తోడు నాసిరకం సరుకులు, కుళ్లిన కురగాయలతో వంటలు చేయడం, నీళ్లచారు, పలుచటి చట్నీ వంటివి వడ్డిస్తుండటంతో విద్యార్ధులు ఇబ్బదులు పడుతున్నారు. పైస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
జిల్లాలో 85 సంక్షేమ హాస్టళ్లకు 50 మంది వార్డెన్లు
సూర్యాపేట జిల్లాలో మొత్తం 85 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో బీసీ సంక్షమ వసితీ గృహాలు 25 కాగా ఇందులో 16 ప్రీ మెట్రిక్, 09 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. ఎస్సీ సంక్షేమ వసతీ గృహాలు మొత్తం 39 ఉంటే ఇందులో 33 ప్రీ మెట్రిక్, 06 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. అదే విదంగా 21 ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు ఉండగా ఇందులో 13 ప్రీ మెట్రిక్, 08 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో సుమారు 10 వేల మంది విద్యార్థులు ఉంటూ వసతి పొందుతున్నారు. బీసీ సంక్షేమశాఖలో 13 మంది వార్డెన్లు, ఎస్సీతో 26 మంది, ఎస్టీలో 11 మంది మొత్తం 50 మంది వార్డెన్లు ఉన్నారు.
వార్డెన్ల పర్యవేక్షణ కరువు
ఇంట్లో తమ పిల్లల్లాగానే విద్యార్ధులను కంటికి రెప్పలా చూసుకోవల్సిన భాధ్యత హాస్టళు సంక్షేమ అధికారులది. ఉదయం లేచింది మొదలు టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనంతో వారి దిన చర్య ముగుస్తోంది. ఈ సమయంలో హాస్టల్ వార్డెన్ విధిగా హాస్టల్లో ఉండి పర్యవేక్షించాలి. అంతే కాకుండా విద్యార్థుల క్రమశిక్షణ, హాజరుశాతం చూడాల్సిన భాధ్యత వారిపైనే ఉన్నది. కాని జిల్లాలో ఒక్కరిద్దరు మినహా అన్ని శాఖల సంక్షేమాధికారులు కేవలం జీతం కోసం పని చేస్తున్నారే తప్ప విద్యార్థులపై పర్యవేక్షణ లేడనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో మూడు శాఖల పరిధిలో మొత్తం 85 హాస్టళ్లు ఉంటే కేవలం 50 మంది మాత్రమే వార్డెన్లు ఉన్నారు.
ఇంకా 35 హాస్టళ్లకు ఇంచార్జ్ అధికారులు బాధ్యతలు వహిస్తున్నారు. బీసీ, ఎస్టీ శాఖలలో దాదాపు ప్రతి వార్డెన్ కు ఒక రెగ్యూలర్ హాస్టల్ కేటాయించగా మరో హాస్టల్ కు ఇంచార్జ్ భాధ్యతులు ఇచ్చారు. ఎస్సీ హాస్టళ్లలో కొండరు రెండు హాస్టళ భాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే అదునుగా వారు రెండు హాస్టళ్లుకు వెల్లకుండా వర్కర్లకు భాధ్యతలు ఇచ్చి కాలం వెల్లదిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో హాస్టళ్లలో ఏమి జరుగతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది.
నాసిరకం నరుకులకు తోడు సంఖ్యకు నరిపడా అందని వైనం
జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చాలా వరకు నాణ్యతలేని నాసిరకం సరుకులు, వంటి సామాగ్రితో వంట చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారని విద్యార్ధులు వాపోతున్నారు. అంతే కాకుండా విద్యార్ధుల సంఖ్యకు సరిపడ సరుకులు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్ధులకు నాణ్యమైన వంటలు అందిచలేక పోతున్నామని, వంటలు బాగ లేక పోతే తమపైకి నెట్టుతున్నారని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని హాస్టళ్లలో మెనూ పాటించడం లేదని విద్యార్ధులు అంటున్నారు.
కొన్ని హాస్టళ్లలో మెనూ పాటిస్తున్న విద్యార్ధుల సంఖ్య మేరకు సరుకులు ఇవ్వకపోవడంతో నీళ్లచారు, పలుచటీ చట్నీ, చాలిచాలని కూర, చిన్నచిన్న ఇడ్లీలతో సరిపోట్టుకోవల్సి వస్తోంది. విద్యార్ధుల సంఖ్య మేరకు వార్డెన్లు సరుకులు ఇస్తే తప్ప వారికి సరైన ఆహారం లభించని పరిస్థితి నెలకొన్నది. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని విద్యార్ది సంఘాల నాయకులు కోరుతున్నారు.