27-04-2025 12:53:14 AM
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): వరంగల్‌లో జరుగబోయే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చారిత్రక సభలో కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్నదని చెప్పారు.
ఈ సభకు గులాబీ సైనికులతోపాటు తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. శనివారం పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలసి గులాబీ జెండాలు ఆవిష్కరించుకొని సభకు రావాలని సూచిం చారు. సభకు వచ్చే వారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు.
వాహనాలకు గులాబీ జెండాలు కట్టుకోవాలని సూచించారు. ఎండల తీవ్రత ఉన్నందున బస్సుల్లో మంచినీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లతో పాటు భోజన వసతికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ జాములు కాకుండా ఇప్పిటికే రూట్ మ్యాప్ పంపించామని, దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో రావాలని కోరారు. పార్టీ వలంటీర్లు ఎప్పటికప్పుడు గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారని వెల్లడించారు.