- అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ
- వరంగల్ మాస్టర్ ప్లాన్ 2౦5౦కి ఆమోదం
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4170 కోట్లు మంజూరు
- మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు అడుగులు
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
- నేడు వరంగల్‌లో పర్యటించనున్న సీఎం
జనగామ/హైదరాబాద్, నవంబర్ 18(విజయక్రాంతి): హైదరాబాద్ తరహాలో వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇప్పటికే వరంగల్ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ 2౦5౦ని ఆమోదించినట్టు వెల్లడించారు.
మామూనూరు విమానాశ్రయం ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో సీఎం సభ కోసం చేపడుతున్న ఏర్పాట్లను సోమవారం మంత్రి పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అయిన వరంగల్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని వెల్లడించారు. వరంగల్ శివారులో మామూనూరు విమానాశ్రయం ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌లో వెయ్యి కోట్లతో ఆరు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌లు నిర్మించబోతున్నట్టు వివరించారు.
వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.౪౧౭౦ కోట్లు, భద్రకాళి ఆలయ మాడవీధుల కోసం రూ.30 కోట్లు విడుదల చేసినట్టు ప్రకటించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం నగరంలో కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు.
కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగాంగా మంగళవారం వరంగల్‌లో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హనుమకొండలోని కుడా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్దకు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా ముందుగా బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించే విజయోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య సభ్యులతో ముఖాముఖి మాట్లాడుతారు.
22 జిల్లాల్లో ప్రభుత్వం నిర్మించబోయే ఇందిరా మహిళా శక్తి భవనాలతోపాటు ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లను ప్రజాపాలన విజయోత్సవ సభ వేదిక నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంకు లింకేజ్ చెక్కులు, బీమా చెక్కులు పంపిణీ చేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు వెళ్తారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
ఇందిరామహిళా శక్తి ప్రాంగణం(ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కాలేజీ గ్రౌండ్)లో సీఎం బహిరంగ సభకు అధికారులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేశారు. లక్ష మంది మహిళలతో సభ నిర్వహించేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి టూర్ సందర్భంగా బహిరంగ సభా ఏర్పాట్లను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు.