మూడు రోజుల క్రితమే ‘దేవర’ పార్ట్-1కు సంబంధించి తన షెడ్యూల్ పూర్తి చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇంతలోనే ఆయన ఎడమ చేతి మణికట్టుకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. ఈ ప్రభావం ఎన్టీఆర్ రాబోయే సినిమా ‘వార్2’ చిత్రీకరణపై పడింది. వాస్తవానికి ‘దేవర’ తొలిభాగానికి సంబం ధించి చిత్రీకరణ పూర్తయిన వెంటనే ఆయన ‘వార్2’ షూటింగ్లో పాల్గొనాలనుకున్నారు. ఈ మేరకు మేకర్స్‌తో చర్చల సందర్భంగా ముందుగా అనుకున్న ప్రకారం ముంబయిలో రెండు నెలల భారీ షెడ్యూల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా, యష్ రాజ్ ఫిల్మ్స్ ద్వారా నిర్మితమవుతున్న ఎన్టీఆర్ అప్‌కమింగ్ ప్రాజెక్టే ‘వార్2’.
వచ్చే ఏడాది ఆగస్టు 15న ‘వార్2’ విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ విశ్రాంతిలో ఉన్న కారణంగా ‘వార్2’ ముంబయి షెడ్యూల్‌ను వాయిదా వేశారని సమాచారం. పూర్తిగా కోలుకున్న తర్వాత.. సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సన్నివేశాన్ని చిత్రీకరిస్తారని తెలిసింది. ఓడలో ఈ షూటింగ్ జరుగుతుందని, ఇందుకు సంబంధించిన సెట్‌ను యష్ రాజ్ స్టూడియోస్‌లో ఇప్పటికే సిద్ధం చేశారని సమాచారం. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి 15 రోజుల షెడ్యూల్ ప్రస్తుతం ఇటలీలో కొనసాగుతోంది. ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ పాల్గొంటున్నారు. సెప్టెంబర్‌లో యూరప్‌లో ఒక పాటను చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ ఇటీవల పూర్తి చేసిన పాన్ -ఇండియా చిత్రం ‘దేవర’ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.