calender_icon.png 21 September, 2024 | 5:31 AM

ఓయూలో విద్యార్థి సంఘాల మాటల యుద్ధం

21-09-2024 01:47:35 AM

  1. కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఏబీవీపీ
  2. ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ప్రెస్ మీట్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఈ నెల 17న వినాయక నిమజ్జనం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో టీఎస్‌ఏ, ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులకు మధ్య జరిగిన ఘర్షణ పరస్పర ఆరోపణలకు దారి తీసింది.  శోభాయాత్రను అడ్డుకుని ఫ్లెక్సీలను చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఏబీవీపీ నాయకులు ఓయూలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేయగా, ఓయూలోని వామపక్ష, దళిత, బహుజన విద్యార్థి సంఘాల నాయకులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ.. ఏబీవీపీ నాయకులపై దురుద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆరోపించారు. వారికి కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలకడం సరికాదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ సెక్షన్ ఉండాలో గాంధీ భవన్ నుంచి డిక్టేట్ చేస్తున్నారని విమర్శించారు.  

కులగణనపై ప్రశ్నించినందునే దాడి..

విద్యార్థి సంఘాల నాయకులు ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఓయూ పీడీఎస్‌యూ అధ్యక్షుడు సుమంత్, ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కోట శ్రీనివాస్, తెలంగాణ పొలిటికల్ జేఏసీ నాయకుడు వలిగొండ నరసింహ, బీఆర్‌ఎస్‌వీ నేత దశరథ్‌తో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బీసీ హక్కులపై మాట్లాడిన టీఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ఎం శ్రీకాంత్‌యాదవ్‌పై ఏబీవీపీ గూండాల దాడిని ఖండిస్తున్నామన్నారు. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను శ్రీకాంత్ ప్రశ్నిస్తున్నారని, కులగణన, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల విషయంపై ఉద్యమిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఏబీవీపీ గూండాలు కావాలనే కక్షగట్టి శ్రీకాంత్, అతని మిత్రులపై భౌతికదాడి చేశారని ఆరోపించారు.