నీళ్లు, నియామకాలు, కరెంట్‌ను మించి ప్రచారం
కొత్త స్లోగన్లపైనే కీలక నేత దృష్టి
వాటిపైనే ప్రధాన చర్చ
ముంబై, నవంబర్ 16: సాధారణంగా ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలపై పార్టీలు ఎక్కువగా దృష్టి పెడతాయి. అధికార, విపక్ష నేతలు ఈ అంశాలపైనే ఆరోపణలు చేసుకుంటారు. కానీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారంలో నినాదాలకు సంబంధించి వివాదం జరుగుతోంది. వాటిపైనే పెద్ద ఎత్తున చర్చిస్తుండ టం గమనార్హం. కరెంట్, నీళ్లు, రోడ్లు వంటి సమస్యలపై కాకుండా రాజకీయ నినాదాలపై మహారాష్ట్ర రాజకీయం నడుస్తోంది. అంతేకాకుండా ప్రాంతీయత, కుల రాజకీయాల వంటి అంశాలపై నేతలు మొగ్గు చూపుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇందిరా కాలం నుంచీ..
మాజీ ప్రధాని ఇందిరా కాలం నుంచే ఎన్నికల్లో నినాదాలకు ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. ఇందిరాగాంధీ గరిభీ హఠావో, దేశ్ బచావో అనే పిలుపుతో కాంగ్రెస్ అధికారాన్ని కొనసాగించారు. ఎమర్జెన్సీ తర్వాత జయప్రకాశ్ నారాయణ్ ఇందిరా హఠావో, దేశ్ బచావో నినాదంతో జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలా భారత ఎన్నికల్లో రాజకీయ నేతల నినాదాలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి.
ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఎక్కువగా నినాదాలపైనే చర్చ జరుగుతుండటం విశేషం. మహారాష్ట్రలో గత 20 ఏళ్ల ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తే ఈసారి ఎందుకు విభిన్నంగా కనిపిస్తున్నాయో అర్థమవుతుంది.
2024లో మార్పు
2024 లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీలు కొత్త స్వరాలను ఎన్నుకున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ, కుల విభజన, కూటముల్లో పొత్తులు వంటి అంశాలపై రాజకీయాలు నడిచాయి. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన బాటెంగే తో కాటెంగే (విడిపోతే అంతమవుతాం) నినాదంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. మహారాష్ట్రలోని అధికార కూటమి నేతలే యోగి వ్యాఖ్యలను తప్పుబట్టారు.
ఇదే అంశాన్ని ప్రతిపక్ష కూటమి ఇండియా కూడా ప్రచారాస్త్రంగా మార్చుకుంది. బీజేపీ మతతత్వ భావాలను రెచ్చగొడుతోందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు కులగణనపై కాంగ్రెస్ దృఢ నిశ్చయ ంతో ఉండటంతో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు, వివాదాలకు దారితీసింది.
కలిసుంటేనే భద్రత: మోదీ
యోగి నినాదాన్ని కొద్ది మార్చిన ప్రధాని మోదీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులపై ప్రస్తావించారు. అందరూ ఐక్యంగా ఉంటేనే భద్ర ంగా ఉంటామంటూ మహారాష్ట్రలో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించారు. హర్యానాలో ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారని చెప్పారు. జాతీయ ఐక్యతను బలహీన పరిచే వారిని తిరస్కరించారని చెప్పారు. కులాల మధ్య చిచ్చు పెడితే దేశం బలహీనపడుతుందని కాంగ్రెస్ భావిస్తోందని, అందు కే ఇలాంటి రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
భయపడితే అంతమే: ఖర్గే కౌంటర్
బీజేపీ నినాదాలకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు. బీజేపీ వ్యాఖ్యల ను విమర్శిస్తూ ఢరోగే తో మరోగే (భయపడితే అంతమే) అని ఎదురుదాడికి దిగారు. భయాన్ని వ్యాప్తి చేయడం, విభజనను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూల్చివేస్తోందని, పార్లమెంటులో చర్చలను అణచివేస్తోందని మండిపడ్డారు.
గత 20 ఏళ్లలో నినాదాల హోరు
1999లో అబ్‌కీ బార్ వాజ్‌పేయీకీ స ర్కార్ పేరుతో బీజేపీ క్యాంపెయిన్ చేసింది. ౧౯౯౮లో పార్లమెంట్‌లో ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో మళ్లీ ఈ నినాదంతో వాజ్ పేయీ అధికారంలోకి వచ్చారు.
* 2004లో వాజ్‌పేయీ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ఇండియా షైనింగ్ నినాదంతో ముందుకు వెళ్లింది. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది.
* 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ నిర్మాణ్ అనే నినాదంతో ప్రచారం సాగించింది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది.
* 2014లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని చెబుతూ.. అబ్‌కీ బార్ మోదీ సర్కార్ (ఈసారి మోదీ ప్రభుత్వం) నినాదంతో బీజేపీ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగింది. ఉద్యోగాల కల్పన హామీలు కూడా ఓటర్లపై ఎక్కువ ప్రభావాన్ని చూపాయి. మోదీ ప్రభుత్వం కొలువుదీరింది.
* 2019లో ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం), హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ (ఎక్కడ చూసినా మోదీయే, ప్రతి ఇంట్లో మోదీయే) నినాదాలతో బీజేపీ ప్రముఖంగా మోదీ ముఖచిత్రంతోనే రెండోసారి బరిలోకి దిగి భారీ విజయం సాధించింది.