హమాస్, హిజ్బొల్లా నేతల హత్యలతో ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధంగా ఇరాన్ సహా మిత్రపక్షాలు
ఇజ్రాయెల్ రక్షణకు రంగంలోకి అమెరికా
భారీగా జైట్ ఫైటర్లు, యుద్ధ నౌకలు మోహరిస్తామని హామీ
వాషింగ్టన్, ఆగస్టు 3: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌లో హమాస్‌కు చెందిన ఇద్దరు నేతలు, లెబనాన్‌లో హిజ్బొల్లా కమాండర్ హత్యల తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్, దాని మిత్ర దేశాలు ఎప్పుడైనా దాడికి దిగే అవకాశముంది. ఇప్పటికే ఇరాన్ హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఇటీవల జరిగిన మొత్తం 3 హత్యల్లో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్, హమాస్, హిజ్బొల్లా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. పశ్చిమాసియాలో అదనపు యుద్ధ విమానాలు, వార్ షిప్పులను భారీగా మోహరించేందుకు సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్‌కు రక్షణ అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనాసింగ్ తెలిపారు. అక్కడికి మరిన్ని ఫైటర్ జెట్లు, యుద్ధనౌకలు పంపాలని అమెరికా డిఫెన్స్ చీఫ్‌ను ఆదేశించినట్లు పెంటగాన్ పేర్కొంది.
అమెరికా హామీ..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య చర్చలు జరిగినట్లు పెంటగాన్ తెలిపింది. అంతేకాకుండా అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు అదనపు సాయాన్ని అందిస్తామని ఆస్టిన్ హామీ ఇచ్చారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్‌ను పంపనున్నట్లు తెలిపారు. వీటితో పాటు బాలిస్టిక్ మిస్సైళ్ల నుంచి రక్షించే క్రూజర్లు, డెస్ట్రాయర్లను మోహరిస్తామని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యానికి కొత్త ఫైటర్ స్కాడ్రన్‌ను సైతం పంపుతామన్నారు.
టెహ్రాన్‌లో కీలక సమావేశం..
లెబనాన్ రాజధాని బీరుట్‌లో హిజ్బొల్లా కమాండర్ ఫౌద్ షుకర్‌ను ఇజ్రాయెల్ చంపేసింది. కొన్ని గంటల తర్వాత ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయెల్ హానియే హతమయ్యాడు. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. ఈ విషయంపై టెహరాన్‌లో యాక్సిక్ ఆఫ్ రెసిస్టెంట్స్ ప్రతినిధులతో ఇరాన్ అధికారులు బుధవారం సమావేశమైనట్లు హిజ్బొల్లా వర్గాలు తెలిపాయి. ఇందులో రెండు కీలక అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. అందరమూ కలిసి దాడి చేయాలా? లేదంటే వేర్వేరుగా దాడులు చేయాలా? అని సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్‌కు రక్షణగా..
ఏప్రిల్‌లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికా బలగాలు నిలబడ్డాయి. అక్టోబర్, ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల విషయంలో ఆ దేశానికి రక్షణ ఉన్నామని, ఇప్పుడూ అదే చేస్తామని సబ్రితాసింగ్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేస్తామనమి పేర్కొన్నారు. అంతేకాకుండా గాజాలో శాంతి పరిస్థితులు నెలకొనేలా ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.
భారతీయులకు అలర్ట్
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న ఇతర దేశాల పౌరులు జాగ్రత్తగా ఉండాలని పశ్చిమాసియా హెచ్చరించింది. ముఖ్యంగా భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో భద్రతా ప్రోటోకాల్ పాటించాలని తెలిపింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు లెబనాన్‌కు వెళ్లొద్దని భారత పౌరులకు బీరుట్‌లోని ఇండియన్ కాన్సులేట్ హెచ్చరించింది. లెబనాన్‌ను విడిచి వెళ్లాలని సూచించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు ఆగస్టు 8 వరకు విమాన సర్వీసులు నిలిపివేసింది.