- కులగణన ఎక్స్‌రే కాదు.. మెగా హెల్త్ చెకప్
- ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి
- నవంబర్ ౩౦ లోగా కులగణన పూర్తిచేసి భవిష్యత్ పోరుకు సిద్ధం కావాలి
- రాహుల్‌గాంధీ ఆదేశాలను ప్రతీ ఒక్కరు పాటించాల్సిందే
- కులగణన అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : దేశానికి తెలంగాణ ఒక మోడల్‌గా మరాలని, ఆ దిశగా కులగణన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ మోడల్ దేశంలో రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుల గణకు అనుకూలంగా లేదని, తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం ప్రకటించాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో తెలంగాణ మోడల్‌ను పరిగణలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంటన్‌ను కేంద్రానికి పంపుతామన్నారు.
పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప.. వ్యక్తిగత ఎజెండాతో పని చేయడనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సీఎం చెప్పారు. తనకు పార్టీ ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు తిరిగి ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు.
రాహుల్‌గాంధీ ఆదేశా లను ప్రతి ఒక్కరు పాటించాలని, ప్రతిపక్షాల కుట్రలను ప్రతీ ఒక్కరు తిప్పికొ ట్టాలని సూచించారు. కులగణన అనేది ఎక్స్‌రే మాత్రమే కాదని, ఇది మెగా హెల్త్ చెకప్ అని అన్నారు. రాష్ట్రంలో కులగణన చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకేళ్లాలన్నారు.
కులగణనపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావే శానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పార్టీ సీనియర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డువచ్చినా అది నెరవేరి తీరుతుందనీ సీఎం పేర్కొన్నారు. రాహు ల్‌గాంధీ ఇచ్చిన మాటను అమలుచేసే క్రమంలో ఎవరు అభ్యంతకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించదని సీఎం హెచ్చరించారు.
నవంబర్ 30 కల్లా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమన్నారు.
గాంధీ కుటుంబం మాటే ఇస్తే అమలయినట్లే..
‘తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని, సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ మాట ఇచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా మాట ఇచ్చారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదొడులకు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో ఆమె సఫలీకృతమయ్యారు.
తెలంగా ణ ఏర్పాటుచేసి ఇచ్చిన హామీని నేరవేర్చారు. కులగణనపై రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టడం ఇక్కడున్న ప్రతీ ఒక్కరి బాధ్యత. రేవంత్‌రెడ్డినా.. మహేశ్‌కుమార్‌గౌడా అనేది కాదు.. మనం మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం. మీరంతా కష్టపడితేనే నాకు ఈ బాధ్యత వచ్చింది ’ అని సీఎం అన్నారు.
33 జిల్లాలకు 33 మంది పరిశీలకులు
గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే మరో చర్చకు తావులేదని, ఒక వేళ చర్చకు ఎవరైనా అవకాశం ఇచ్చారంటే వారు పార్టీ ద్రోహులేనని రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ విధానాన్ని అమలుచేయడమే మన ప్రభుత్వ విధానమన్నారు. అందుకే కాంగ్రెస్ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్‌ను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించినట్లు సీఎం వివరించారు.
కులగణనతో పాటు ఇతర అంశాలపై పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ క్యాడర్, లీడర్లపైన ఉందని, బాధ్యతగా పనిచేసేవారి కష్టానికి ఫలితం తప్పకుం డా ఉంటుందన్నారు. కులగణనపై సమన్వయం చేసేందుకు 33 జిల్లాలకు గాను 33 మందిని పార్టీ నుంచి పరిశీలకులుగా నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
గ్రూప్1 విషయంలో నష్టం జరగదు
ప్రతిపక్షాలు తమ రాజకీయ మనుగడ కోసం ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేశామని, 10 నెలల్లోనే 50 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గ్రూప్ విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాలుగా అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూశాయన్నారు.
జీవో ఇచ్చినప్పుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినప్పుడు కూడా కోర్టుకు పోలేదని, కానీ మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్‌ను కొట్టివేసిందన్నారు. అగ్రవర్ణాల కోసమే గ్రూప్ నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని వాదన కూడా తీసుకొచ్చారని తెలిపారు.
గ్రూప్ సెలక్ట్ అయిన 31,383 మందిలో 10 శాతం లోపే అగ్రవర్ణాలన్నారని, బీసీలు 51.11 శాతం, ఎస్సీలు 15.38 శాతం, ఎస్టీలకు 8.87 శాతం, ఈడబ్ల్యూఎస్ కోటాలో 8.84 శాతం సెలక్ట్ అయ్యారని సీఎం వివరించారు. స్పోర్ట్స్ కోటాలో కూడా 20 మంది సెలక్ట్ అయ్యారని తెలిపారు.
కులగణనకు తెలంగాణ పరిశోధన కేంద్రం : డిప్యూటీ సీఎం భట్టి
కుల గణనకు తెలంగాణ పరిశోధన కేంద్రంగా, ఒక మోడల్‌గా నిలిచి దేశానికి సందేశం ఇవ్వబోతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశ వనరులు, ఆస్తులు అందరికి సమానంగా దక్కడం లేదని, అందుకే కులగణన చేపట్టి, అందరికి సమాన అవకాశాలు కల్పించాలని రాహుల్‌గాంధీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కులగణన చేయాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని భట్టి తెలిపారు. ఈ సర్వేలో ఏ సమాచారం సేకరించాలి, ఏ ప్రశ్న లు ఉండాలనేది తెలుసుకోవడం కోసమే పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆస్తుల వివరాలు వద్దు : వీహెచ్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన మంచి నిర్ణయమని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. అయితే కులగణన వివరాల్లో కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు అడిగితే ప్రజల్లో అపోహకలిగే ప్రమాదం ఉందని, అందుకు ఆస్తు, పాస్తుల వివరాలను సేకరించవద్దని వీహెచ్ సూచించారు.
సొంత ఇళ్లు ఉందా..? కొడుకులు ఏం చేస్తున్నారు..? భూమి ఎంత ఉంది..? అని ఇలాంటి వివరాలను అడిగే ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం దొరుకుతుందని, దీంతో ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమానికి ఆటంకం కలిగించే ప్రయత్నం జరుగుతుందని వీహెచ్ పేర్కొన్నారు. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు..? ఏ కులం అని తెలుసుకుంటే సరిపోతుందని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో ఏఐసీసీ నాయకులు కొప్పు ల రాజు, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, షబ్బీర్‌అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి , ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్‌తో పాటు ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ నాయకుల హాజరయ్యారు.
2న డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో సమావేశాలు
గాంధీభవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : పీసీసీ చీఫ్
కులగణన కార్యక్రమాన్ని ప్రతీ ఒక్క రూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. నవంబర్ 2న రాష్ట్రంలోని 23 జిల్లాలలో కులగణనపై డీసీసీ అధ్యక్షులు సమావేశాలు నిర్వహించాలని, మేధావులు, ప్రజలతో సలహాలు తీసుకుని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శం గా నిలవబోతుందని, రాహుల్‌గాంధీ సామాజిక న్యాయం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్రతో రాహుల్‌గాంధీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేశారని, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే కులగణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.
కుల గణనపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సాహోసపేతమైన నిర్ణయం తీసుకున్నారని, దీన్ని పార్టీ పరంగా సంపూర్ణంగా అండగా నిలబడి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణనపై ఎలాంటి అనుమానాలు ఉన్న గాంధీభవన్‌లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామన్నారు.
డిసెంబర్ 7 వరకు కులగణన పూర్తి
డిసెంబర్ 7 వరకు కులగణన పూర్తి చేయాలని భావిస్తున్నామని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. నవంబర్ 5, 6న రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నాయకులతో కుల గణనపై సమావేశం ఉంటుందన్నారు. జనాభా ఎంత శాతం ఉంటే అంత వాటా రావాలని రాహుల్‌గాంధీ చెప్పారని, సమగ్ర కులగణన నిష్పక్షపాతంగా జరగాలన్నారు.
గత ప్రభుత్వం అరాచకాల మీద చర్యల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన డిమాండ్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్వీకరించాలన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను టేబుల్ చేయలేదన్నారు.