calender_icon.png 15 November, 2024 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంటులో వక్ఫ్ మంటలు

09-08-2024 01:09:52 AM

లోక్‌సభలో బిల్లు పెట్టిన మంత్రి రిజిజు

బోర్డు మాఫియా చేతిలోకి వెళ్లిందని విమర్శ

ఇది క్రూరమైన బిల్లు.. విపక్షాల మండిపాటు

రాజ్యసభను కుదిపేసి ఫొగాల్ వివాదం

జాయింట్ పార్లమెంటరీ కమిటీని వక్ఫ్ బిల్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 8: పార్లమెంటులో పలు అంశాలపై అధికార, విపక్ష పార్టీల సభ్యుల విమర్శలు, ప్రతి విమర్శలతో గురువారం తీవ్ర గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా వక్ఫ్ చట్టసవరణ బిల్లు, ఒలింపిక్స్ నుంచి బహిష్కర ణకు గురైన వినేష్ ఫొగాట్ వ్యవహారం, పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, నిత్యావసర వస్తువుల ధరల అంశాలపై తీవ్ర వాదోపవాదాలు, నిరసనలు, వాకౌటుల చోటుచేసుకొన్నాయి. ఒక దశలో రాజ్యసభలో సభ్యులు తన మాట వినటంలేదని చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అలిగి వెళ్లిపోయారు.  

లోక్‌సభలో వక్ఫ్ బిల్లు

వక్ఫ్ చట్టెేం1995 సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటరీ, మైనారిటీ వ్యహహారాల శాఖల మంత్రి కిరెన్ రిజిజు ఈ బిల్లును సభ ముందుంచారు. ఈ బిల్లుకు ఎన్డీయే ప్రధాన భాగస్వాములు టీడీపీ, జేడీయూ మద్దతు ప్రకటించాయి. విపక్షాల నిరసనల నేపథ్యంలో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపుతామని రిజిజు తెలిపారు. 

ఏ మతంలోనూ జోక్యం కాదు

వక్ఫ్ బిల్లుపై విపక్షాల ఆరోపణలను మంత్రి కిరెన్ రిజిజు తోసిపుచ్చారు. తాము ఏ మత అంతర్గత వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవటం లేదని అన్నారు. ‘సచార్ కమిటీ సిఫారసుల మేరకే నేడు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టాం. ఆ కమిటీని వేసింది కాంగ్రెస్ పార్టీయే. మేం ఎవరి అధికారాలనూ లాక్కోవాలని అనుకోవటం లేదు. ఇప్పటివరకు ఎలాంటి హక్కులు అనుభవించనివారి ఈ బిల్లు హక్కులు కల్పిస్తుంది. వక్ఫ్ బోర్డులను మాఫియా ఆక్రమించుకొన్నది. వక్ఫ్‌బోర్డులో పారదర్శకత కోసమే ఈ బిల్లును తెచ్చాం’ అని తెలిపారు.

ఇది క్రూరమైన బిల్లు

వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ నాయకత్వంలో విపక్ష పార్టీలు లోక్‌సభలో తీవ్ర అభ్యంతరం, నిరసన తెలిపాయి. బిల్లుపై మాట్లాడిన కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్.. ‘ఈ బిల్లు అత్యంత క్రూరమైనది’ అని వ్యాఖ్యానించారు. ‘ ఈ బిల్లు రాజ్యాంగ మూలాలపై నేరుగా దాడి చేయటమే. ఇది దేశాన్ని మతపరంగా రెండు ముక్కలు చేస్తుంది. మతాల మధ్య విద్వేషాలు రగిలిస్తుంది. మీ (బీజేపీ) అసలు ఉద్దేశం వివాదాలు సృష్టించటమే. మతాల మధ్య ఆగ్రహావేశాలు రగిలించటమే.

దేశంలో ఎక్కడ చూసినా హింసను సృష్టించటమే. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసమే ఈ బిల్లు తెచ్చారు. ఈ బిల్లు తర్వాత బీజేపీ క్రైస్తవుల వద్దకు వెళ్తుంది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బిల్లుపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా మండిపడ్డారు. ‘ఒక రాజకీయ ప్రణాళికతోనే ఈ బిల్లును తెచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల విధానం ఉండగా, కొందరిని నామినేట్ చేసే విధానం ఎందుకు? అని ప్రశ్నించారు.

రాజ్యసభలో ఫొగాట్ రగడ

అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్ క్రీడాకారిణి వినేశ్ ఫొగాట్ బహిష్కరణకు గురి కావటంపై రాజ్యసభలో గురువారం విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఫొగాట్‌కు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సభలో విపక్ష సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఎంత వారించినా సభ్యులు పట్టు వీడలేదు. ఫొగాట్ బహిష్కరణలో కుట్ర కోణం ఉన్నదని ఆరోపించారు. ఫొగాట్‌ను బలి చేశారని విపక్ష సభ్యులు ఆరోపించారు. సభ్యులు ఎంతకూ మాట వినకపోవటంతో చైర్మన్ ధన్‌ఖడ్ అలిగి వెళ్లిపోయారు. విపక్షాలు కూడా సభ నుంచి వాకౌట్ చేశాయి.

వక్ఫ్‌బోర్డులో ప్రతిపాదిత సంస్కరణలు

* వక్ఫ్ యాక్ట్ 1995 ప్రకారం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వక్ఫ్ బోర్డుల్లో ప్రస్తుతం ముస్లిం పురుషులకు మాత్రమే చోటు ఉన్నది. -ప్రతిపాదిత బిల్లులో జాతీయ, రాష్ట్ర స్థాయి వక్ఫ్‌బోర్డుల్లో ముస్లిమేతరులకు, ముస్లిం మహిళలకు కూడా సభ్యులుగా చోటు కల్పించాలని ప్రతిపాదించారు.

* వక్ఫ్ యాక్ట్ ఇకపై యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియంట్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్ అని పిలుస్తారు. 

* ముస్లిం పర్సనల్ లా ప్రకారం ముస్లిం మత అవసరాలకు, స్వచ్ఛంద కార్యక్రమాల కోసం దాతలు ఇచ్చిన భూమిని ప్రత్యేకంగా నిర్వహించే సంస్థనే వక్ఫ్‌బోర్డు అంటారు. ఈ బోర్డు తన పరిధిలోకి వచ్చిన ఏ భూమినైనా వక్ఫ్ ఆస్థిగా ప్రకటించే అధికారం ఉన్నది. ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 40 బోర్డుకు ఈ అధికారం కల్పిస్తున్నది.

* కొత్త బిల్లు ద్వారా సెక్షన్ 40ని రద్దుచేయనున్నారు. అంటే ఇకపై వక్ఫ్‌బోర్డు తనకు తానుగా ఏ భూమినీ వక్ఫ్ ఆస్థిగా ప్రకటించటానికి వీలు ఉండదు. ఈ అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టనున్నారు. 

* కొత్త బిల్లు ప్రకారం జాతీయ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్రాల వక్ఫ్‌బోర్డుల స్వరూపాన్ని కేంద్రం ఖరారు చేసింది.

* జాతీయ వక్ఫ్ కౌన్సిల్‌తోపాటు రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో కనీసం ఇద్దరు మహిళలకు చోటు ఉండాలి. కౌన్సిల్‌లో ఒక కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు, ముస్లిం సంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులు, ముగ్గురు ముస్లిం పర్సనల్ లా నిపుణులు ఉంటారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులకు చెందిన ముగ్గరు మాజీ న్యాయమూర్తులు, జాతీయస్థాయి ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు నలుగురికి కూడా ఇందులో చోటు ఉంటుంది. వీరిలో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. 

* ప్రస్తుతం ఉన్నట్టుగా ఏదైనా ఆస్థిని వక్ఫ్ ఆస్తిగా నేరుగా రిజిస్టర్ చేయటానికి వీలుండదు. 

* ముందుగా కౌన్సిల్‌కు చెందిన వెబ్‌సైట్‌లో ఆ ఆస్తి వివరాలు నమోదుచేసి, ఆ తర్వాత అభ్యంతరాలు లేకుంటేనే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. 

* వక్ఫ్ ఆస్తులను సర్వే చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ లేడా డిఫ్యూటీ కలెక్టర్‌కు కట్టబెట్టనున్నారు. 

* బోర్డు తీసుకొన్న నిర్ణయాలను 90 రోజులలోపు హైకోర్టులో సవాల్ చేసేలా కొత్త చట్టంలో నిబంధనను చేర్చనున్నారు.