15-04-2025 11:49:28 PM
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు..
బిల్లుతో దీర్ఘకాలిక భూసమస్యలకు పరిష్కారం..
కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు..
త్రివేండ్రం: వక్ఫ్ బోర్డు బిల్లు ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదని, కేవలం బోర్డులో పరిధిలోని లోటుపాట్లు, తప్పులను మాత్రమే సరిదిద్దామని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. కేరళలోని కొచ్చిలో మంగళవారం ఆయన మీడియా మాట్లాడుతూ.. సవరణ బిల్లు ద్వారా భవిష్యత్తులో ఏకపక్షంగా భూములు లాక్కునేందుకు వీలుండదని స్పష్టం చేశారు. కొందరు ముస్లింలను టార్గెట్ చేసి బిల్లు తీసుకొచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు.
వక్ఫ్ బోర్డుకున్న ప్రత్యేక అధికారాల కారణంగా కేరళలోని మునాంబంలో 404 ఎకరాల భూమి బోర్డు ఆస్తిగా మారిందని, ఫలితంగా 600 మంది మత్స్యకారులు తమ భూమిపై హక్కులు కోల్పోయారని గుర్తుచేశారు. బిల్లు ద్వారా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మునాంబం వంటి భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు చెందిన ఆస్తులను పరిరక్షించడం ప్రభుత్వాల విధి అని, దానినే కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా నిర్వర్తించిందని చొప్పుకొచ్చారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు.