calender_icon.png 3 April, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు

02-04-2025 01:23:58 AM

  1. 8 గంటల పాటు చర్చ
  2. బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన విపక్షాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: పార్లమెంట్‌లో బుధవారం వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. సవరించిన వక్ఫ్ బిల్లును పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చకు లోక్‌సభలో 8 గంటల సమయం కేటాయించారు. అయితే ఈ బిల్లును ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. లోక్‌సభలో ఎన్డీయేకు 298 మంది ఎంపీల బలం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తదితర ఎన్డీయే కూటమి నేతలు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపే అవకాశముంది.

కాగా వక్ఫ్ బిల్లుపై చర్చా సమయం, పార్టీలకు సంఖ్యాబలం ఆధారంగా సమయం కేటాయింపుపై చర్చించేందుకు మంగళవారం స్పీకర్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‌కు పిలుపునివ్వగా ఈ సమావేశాన్ని విపక్షాలు బహిష్కరించాయి. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి వాకౌట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2024లో వక్ఫ్ బ్లిలును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్యనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీ కమిటీ ముందుకు ఈ బిల్లును పంపగా.. వివిధ పార్టీలు, మత సంస్థలు, ప్రముఖ వ్యక్తులతో సుదీర్ఘ చర్చల తర్వాత వక్ఫ్ బిల్లు ముసాయిదాను జేపీసీ రూపొందించింది. తాజాగా పార్లమెంట్ ముందుకు రానున్న సవరించిన వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుందా అన్నది ఆసక్తిగా మారింది.

విప్ జారీ చేసిన కాంగ్రెస్

నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ బిల్లుకు సంబంధించిన చర్చలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాం క చతుర్వేది మాట్లాడుతూ.. ‘మేము తప్పకుండా చర్చలో పాల్గొంటాం. కానీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాం’ అని తెలిపారు.